లక్సెంబర్గ్‌ వేదికపై కీలక ప్రసంగం!

అక్టోబర్‌ 14, 15 తేదీల్లో లక్సెంబర్గ్‌ వెంచర్‌ డేస్‌–2026..
కేటీఆర్‌ను ఆహ్వానించిన నిర్వాహకులు
పెట్టుబడులు, అంకుర సంస్థలు, ఆవిష్కరణలు, భారత్‌–యూరప్‌ భాగస్వామ్యంపై ప్రత్యేక సమావేశంలో ప్రసంగించే అవకాశం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా పెట్టుబడులు, సాంకేతికత, అంకుర సంస్థల రంగాల్లో తనకున్న అనుభవంతో అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందుతున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. యూరప్‌లో పెట్టుబడులు, వెంచర్‌ పెట్టుబడులు, అంకుర సంస్థలకు సంబంధించిన ప్రముఖ కార్యక్రమమైన లక్సెంబర్గ్‌ వెంచర్‌ డేస్‌–2026లో కీలక ప్రసంగం చేయాలని నిర్వాహకులు ఆయనను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సదస్సు అక్టోబర్‌ 14, 15 తేదీల్లో లక్సెంబర్గ్‌లోని లక్స్‌ఎక్స్‌పో ది బాక్స్‌లో జరగనుంది.

లక్సెంబర్గ్‌ వెంచర్‌ డేస్‌ను లక్సెంబర్గ్‌ జాతీయ ఆవిష్కరణ సంస్థ లక్స్‌ఇన్నోవేషన్‌, లక్సెంబర్గ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ అండ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అంకుర సంస్థలు, వేగంగా విస్తరిస్తున్న సంస్థలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కరణ రంగ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. అంకుర సంస్థలకు నిధులు సమకూర్చడం, వ్యాపార విస్తరణకు అవకాశాలు కల్పించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంపై సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

కేటీఆర్‌ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సమావేశంలో ఆసియా, యూరప్‌ దేశాల్లో పెట్టుబడుల విధానాల్లో ఉన్న తేడాలు, పెట్టుబడిదారుల రిస్క్‌ స్వీకరణ ధోరణి, అంకుర సంస్థల వ్యవస్థాపకుల అంచనాలు, పెట్టుబడి అవకాశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాల వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. భారత్‌–యూరప్‌ మధ్య పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో సంబంధాలను మరింత విస్తరించే అంశాలపై కేటీఆర్‌ తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది.

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, అంకుర సంస్థలు, పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన విధానాల్లో కేటీఆర్‌ కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను సాంకేతిక, ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించడం వంటి అంశాల్లో ఆయన పాత్ర ఉంది. ఈ అనుభవం నేపథ్యంలోనే భారత్‌ నుంచి అంతర్జాతీయ పెట్టుబడి, ఆవిష్కరణ వ్యవస్థల మధ్య వారధిగా ఆయన అభిప్రాయాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు భావించినట్లు సమాచారం.

లక్సెంబర్గ్‌ వెంచర్‌ డేస్‌ సాధారణ రాజకీయ సమావేశం కాదు. యూరప్‌ వ్యాప్తంగా పెట్టుబడిదారులు, వెంచర్‌ పెట్టుబడి సంస్థలు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు, సంస్థల ప్రతినిధులు, విధాన నిర్ణేతలు పాల్గొనే వ్యాపార వేదిక. 2025లో జరిగిన కార్యక్రమంలో 3,400 మంది ప్రతినిధులు పాల్గొనగా, 330 మందికి పైగా పెట్టుబడిదారులు పెట్టుబడి అవకాశాలను పరిశీలించినట్లు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి. 414 మంది ప్రసంగకర్తలు, 580కి పైగా పెట్టుబడిదారులు–అంకుర సంస్థల మధ్య సమావేశ అభ్యర్థనలు నమోదయ్యాయి.

ఈ ఏడాది కార్యక్రమంలోనూ పెట్టుబడులు, అంకుర సంస్థల అభివృద్ధి, అంతర్జాతీయ సహకారంపై పలు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. యూరోపియన్‌ ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌, రక్షణ రంగ పెట్టుబడుల వేదికతో పాటు వివిధ రంగాల్లో అంకుర సంస్థలు, పెట్టుబడిదారుల మధ్య చర్చలు, సమావేశాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కుటుంబ పెట్టుబడి సంస్థలు, వెంచర్‌ పెట్టుబడి సంస్థలు, విధాన నిర్ణేతలు, అంకుర సంస్థల వ్యవస్థాపకులతో కేటీఆర్‌ సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది.

ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో సాంకేతికత, పెట్టుబడులు, ఆవిష్కరణలు, అంకుర సంస్థల వ్యవస్థపై కేటీఆర్‌ పలుమార్లు తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో లక్సెంబర్గ్‌ వెంచర్‌ డేస్‌–2026 నుంచి వచ్చిన ఆహ్వానం ఆయనకు మరో అంతర్జాతీయ వేదికగా నిలవనుంది. అయితే కేటీఆర్‌ ప్రసంగించే అంశాలు, కార్యక్రమంలో ఆయన పాల్గొనే తుది వివరాలు అధికారిక కార్యక్రమ పట్టికలో వెల్లడైతే మరింత స్పష్టత రానుంది. అధికారిక కార్యక్రమం మాత్రం అక్టోబర్‌ 14, 15 తేదీల్లో లక్సెంబర్గ్‌లో జరగనుంది.