ramcharan| మెగాస్టార్ క్లాప్‌తో షురూ!
మెగాస్టార్ క్లాప్‌తో షురూ!
- పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘RC17’!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్ట్ క్లాప్..
- రామ్‌చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం
- హైదరాబాద్‌లో వేడుకగా ప్రారంభోత్సవం..
- పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న సినిమా
- మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్త నిర్మాణం..
- హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ మరోసారి తెరపైకి వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘RC17’ అధికారికంగా ప్రారంభమైంది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రయాణం మొదలైంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన క్లాప్ కొట్టి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.
మెగా క్లాప్‌తో గ్రాండ్ స్టార్ట్!
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ దంపతులు, దర్శకుడు మారుతి తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లాప్ కొట్టి చిత్ర బృందాన్ని ఆశీర్వదించడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘ది జర్నీ ఆఫ్ RC17 బిగిన్స్ విత్ ది మెగా క్లాప్’ అంటూ ఈ కొత్త ప్రయాణాన్ని ప్రకటించింది.
మరోసారి కలిసిన హిట్ కాంబినేషన్!
గతంలో రామ్‌చరణ్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, బలమైన కథనంతో సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో RC17పై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం
మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమా కథ, నేపథ్యం, రామ్‌చరణ్ పాత్రకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. హీరోయిన్ ఎవరనే అంశంతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలపైనా స్పష్టత రావాల్సి ఉంది.
‘యూ కెన్ ఇమాజిన్’.. అభిమానుల్లో ఆసక్తి!
సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనకు ముందు విడుదల చేసిన పోస్టర్‌లో ‘యూ కెన్ ఇమాజిన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించడం ఆసక్తిని పెంచింది. ఈ ట్యాగ్‌తో సినిమా కాన్సెప్ట్‌పై అభిమానుల్లో చర్చ మొదలైంది. అయితే కథాంశం, సినిమా జానర్, ఇతర విశేషాలపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు.
వీడియో కోసం కింది లింక్ క్లిక్ చేయండి..
https://twitter.com/MythriOfficial/status/2116773909638819876/video/1
