విజయవాడ సెంట్రల్‌లో వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థుల ప్రకటన

  • 77వ డివిజన్‌ నుంచి నందెపు ఇందిర.. 79వ డివిజన్‌ నుంచి గొట్ల హరేంద్ర
  • మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా సమక్షంలో నియామక పత్రాలు..
  • ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

పాయకాపురం, ఆంధ్రప్రభ: విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులను ప్రకటించింది. 77వ డివిజన్‌ అభ్యర్థిగా నందెపు ఇందిర, 79వ డివిజన్‌ అభ్యర్థిగా గొట్ల హరేంద్రలను నియమించింది. ఈ సందర్భంగా వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా అభ్యర్థులకు పార్టీ కండువాలు వేసి అభ్యర్థులుగా ప్రకటించారు.

అనంతరం ఎమ్మెల్సీ రుహుల్లా కార్యాలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు

సింగ్‌నగర్‌లో ఎమ్మెల్సీ రుహుల్లా కార్యాలయం వద్ద దసరా మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పందిరిలో మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి అమ్మవారిని మల్లాది విష్ణు, రుహుల్లా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్‌ అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు గౌస్‌ మోయుద్దీన్‌, స్థానిక డివిజన్లకు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు హఫీజుల్లా, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.