అన్నపూర్ణమ్మకు శాస్త్రోక్తంగా విశేషార్చనలు

ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ.. అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

నూతన పూజా మండపంలో ఖడ్గమాలార్చన, కుంకుమార్చనలు.. వైభవంగా శ్రీచక్ర నవావరణార్చన, చండీ హోమం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. సకల చరాచర జగత్తుకు అన్నాన్ని ప్రసాదించే జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిభిక్షువైన పరమశివునికి అన్నభిక్షను అందించే అన్నపూర్ణమ్మగా అమ్మవారు కొలువుదీరడంతో కొండపై భక్తిభావం వెల్లివిరిసింది.

చేతిలో బంగారు గరిటె, రత్నఖచిత పాత్ర ధరించి, చిరునవ్వులు చిందించే ముఖారవిందంతో దర్శనమిచ్చిన అమ్మవారి సౌమ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అన్నపూర్ణాదేవి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనయ్యారు. అమ్మవారి కటాక్షంతో అన్నవస్త్ర సమృద్ధి, సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రగాఢ విశ్వాసంతో భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు.

నూతన మండపంలో విశేషార్చనలు

దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని నూతన పూజా మండపంలో అమ్మవారికి విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ దేవీ ఖడ్గమాలార్చన ప్రారంభమైంది. అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ అర్చనలో భాగంగా పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.

అనంతరం మహిళా భక్తులు, దంపతుల సమక్షంలో లలితా సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహించారు. కుంకుమార్చనలతో పూజా మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జగన్మాత అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

వైభవంగా శ్రీచక్ర నవావరణార్చన

మహాశక్తి స్వరూపిణి అయిన జగన్మాతను ప్రసన్నం చేసుకునేందుకు రుత్విక్కులు నూతన పూజా మండపంలో శ్రీచక్ర నవావరణార్చనను వేదోక్తంగా నిర్వహించారు. మంత్రోచ్ఛారణలు, సంప్రదాయ పూజా విధానాల మధ్య జరిగిన ఈ అర్చనతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణం మరింత పరిమళించింది.

మంత్రఘోష నడుమ చండీ హోమం

ఆలయ యాగశాలలో దివ్య చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు, రుత్విక్కుల మంత్రోచ్ఛారణల నడుమ సప్తశతీ మంత్ర పూర్వకంగా హోమ కార్యక్రమం సాగింది. లోకకల్యాణం, సమస్త మానవాళి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అన్నవస్త్ర సమృద్ధిని కాంక్షిస్తూ పూర్ణాహుతి సమర్పించారు.

అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న జగన్మాతను దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి భక్తిమయంగా మారింది. విశేషార్చనలు, శ్రీచక్ర నవావరణార్చన, చండీ హోమం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో దసరా ఉత్సవాల మూడో రోజు వైభవంగా కొనసాగింది.