విద్యుత్ కోతలపై ఆగ్రహం
కాచాపూర్ సబ్‌స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ నాయకులు
రహదారిపై బైఠాయించి రాస్తారోకో
వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్
బిక్కనూర్, ఆంధ్రప్రభ: విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ నాయకులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గురువారం రైతుల ఆధ్వర్యంలో ముట్టడించారు. సుమారు అరగంట పాటు అక్కడ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయానికి నిరంతరంగా 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

రైతులు సాగు చేసిన పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమయపాలన లేకుండా విద్యుత్ సరఫరా చేయడం వల్ల రైతులతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతు సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు.
విద్యుత్ కోతల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతే ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కోతలు లేకుండా వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. అనంతరం విద్యుత్ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
