స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉండాలి

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం శ్రీకాకుళం పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మొదలవలస రమేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేసేలా ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామం, మండలంలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని మరింత పెంచుకోవాలని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో శాసనసభ్యులు తప్పనిసరిగా పాల్గొని వాటిని విజయవంతం చేయాలని చెప్పారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి నాయకులు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో పనిచేయాలని తెలిపారు.

పార్టీ అధిష్ఠానం నిర్దేశించే కార్యక్రమాలను క్రమశిక్షణతో, సమన్వయంతో నిర్వహిస్తూ గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, గౌతు శిరీష, గోవిందరావుతో పాటు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.