ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు..
–అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.
Sunday Magazine సంచికలో…
1.వందేమాతరం.. సుజలాం.. సుఫలాం.. (ముఖపత్ర కథనం)
2.మనసు-మాట శీర్షిక
3.మర్యాద – మర్యాద (కథ)
4.కబుర్లు- శీర్షిక
5.మెదడుకు మేత-సామెత.. శీర్షిక
6.వినరో భాగ్యము – శీర్షిక
1.వందేమాతరం.. సుజలాం.. సుఫలాం..

1875 నవంబరు 7న బంకించంద్ర ఛటోపాధ్యాయ రచించిన వందేమాతర గేయం స్వాతంత్ర రణగీతమై నేటికీ కోట్లాది భారతీయుల గళంలో కదం త్రొక్కుతోంది. భరతమాత స్వేచ్ఛ కోసం పోరాడుతున్న సన్యాసుల జీవితాలను పొందుపరస్తూ.. రచించిన ఆనందమఠం అనే నవలలో ఒక పుట కాలాంతరంలో అగ్నికణంగా మారింది. కలకత్తాలో డిప్యూటీ మేజిస్ట్రేట్ గా పనిచేస్తున్న బంకించంద్ర ఛటర్జీని కల్నల్ ఢఫిన్ అవే ఆంగ్లేయుడు అధికార మదంతో ఆయనను పల్లకీ నుండి లాగి కొట్టి అవమాన పరచాడు. అతనిపై కేసు వేసి బహిరంగ క్షమార్పణ చెప్పించిన బంకించంద్రలో ఆ అవమాన భారం తొలగిపోలేదు. తన కలాన్ని కరవాలంగా మార్చి తన రచనలతో ఆ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడ లాడించాడు.
సంస్కృత, బెంగాలీ భాషల మిశ్రమంగా వందేమాతర గేయన్ని భావించవచ్చు. మొదటి కొన్ని వాక్యాలను మన జాతీయ గేయంగా స్వీకరించడం జరిగింది. రాజ్యాంగ బద్ధమైన వందేమాతర గేయాన్ని ప్రతి ఒక్క భారతీయుడు సదా గౌరవించి ఆలపించాలి. ఈ గేయానికి నిర్దుష్టమైన నియమ-నిబంధనలు లేవు. జాతీయగీతమైన మన జనగణమణకు మాత్రం నియమ-నిబంధనలు ఉన్నాయి.
భారతదేశాన్ని తన కన్నతల్లిలా భావించి రచించిన వందేమాతరం జాతీయ గీత రచయిత శ్రీ రవీంద్రనథ్ రాగూర్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన స్వయంగా పాడిన గేయాన్ని రికార్డు చేసి విడదల చేసారు.
దేశభక్తి పరాయణుడైన బంకించంద్ర రచించిన వందేమాతరం ప్రతి భారతీయునికి ఒక మంత్రరాజము. ఈ రచన యొక్క లోతైన భక్తిభావన ప్రతి దేశభక్తుని హృదయాన్ని రంజింప చేస్తుంది.
వందేమాతరం. మాతా! నీకు వందనం. నాతల్లికి జన్మనిచ్చిన ఓ భారతమాతా! నీకు వందనం. సన్యశ్యామలమైన ఓ తల్లీ నీ బిడ్డలకు ఏ లోటూ లేకుండా యుగయుగాలుగా పోపిస్తున్నావు. నీచల్లని ఒడిలో నీ పిల్లలను లాలించి, పాలించి మంచి బుద్ధులను నేర్పిస్తున్నావు. ఎల్లప్పుడూ మోమున చిరునవ్వు కలిగియుండి స్వచ్ఛమైన మనసుతో, మధురమైన మాటలతో సంభాషించుకునే సంస్కారం మాకు నేర్పావు. సదా ఈ వేదభూమిలో జన్మించిన వారి సుఖసంతోషాలను కాంక్షించావు.
స్త్రీ పురుష భేదం చూడకుండా నీతో సమానమైన కోటి బాహువుల బలాన్ని, ధైర్యాన్ని, శక్తిని మాకు అందించావు. శత్రువుల బారి నుండి రక్షించుకొనే వీరత్వాన్ని, సృజనను కలిగించావు. ఓ భారత మాతా! సంపూర్ణ విద్యలు, తర్క మర్మములు, ధర్మ నిరతిని ఉగ్గుపాలతో నేర్పించావు. మా మనోఫలకాల్లో నీ రూపం నిలిపి ప్రాణశక్తిని, భక్తిని నిక్షిప్తం చేసావు. ఎటువంటి విపత్కర పరిస్థితులలోనైనా దశభుజ దుర్గలా విజృంభించే శౌర్యపరాక్రమాలను అందించావు. సర్వవిద్యల వాణివై, సర్వసౌభాగ్యముల లక్ష్మివై, శారదా రూపిణివై తరతరాలకు ఉద్ధరిస్తూ వస్తున్న నీకు వందనం.
ఈ ధరణిని భరణిలా మోయు సహనముతో భరతజాతి భారమును సహించుచున్న ఓ తల్లీ! భారత మాతా! నీకు ఇవే మా శతకోటి వందనములు. మాతరం! వందేమాతరం !
ఇలా ఆ దేశ భక్తుని భావనను ఊహించవచ్చు. 1886 లో మొట్ట మొదట రవీంద్రనాథ్ రాగర్ బాణీ కట్టి కలకత్తా కాంగ్రెస్ లో ఆలపించారు. 1905 అక్టోబర్ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజున ఆంగ్లేయులు తమ విభజించు- పాలించు అనే కుటిల రాజకీయంలో భాగంగా హిందూ, ముస్లింల ఐక్యతను దెబ్బతీయడానికి బెంగాలును విభజించారు.
ఆసమయంలో.. ఠాగూర్ ఉద్యమ నాయకత్వంలో అవేక మంది స్వాంతంత్ర్య సమరయోధులు పాల్గొన్నారు. హిందూ, ముస్లింలు పరస్పరం సోదరభావంతో రాఖీలు కట్టుకున్నారు. అందరూ ముక్త కంఠంతో వందేమాతర గీతాన్ని సంపూర్ణంగా ఆలపించారు. దేశమంతా అన్ని భాషల్లో వందేమాతరాన్ని కరపత్రాలుగా ముద్రించి విరివిగా పంచిపెట్టారు. 1907లో రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థి అయిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు నాయకత్వంలో వందేమాతర కరపత్రాలు పంచుతూ వందేమాతర గీతాన్ని ఎలుగెత్తి పాడతూ ఊరేగారు.. కాలేజీ ప్రిన్సిపాల్ హంటర్ వారందరీని కాలేజీ నుండి తొలగించారు. ఆ ఉద్యమంలో బెంగాల్ నుండి బిపిన్ చంద్రపాల్ రాజమహేంద్రవరం వచ్చి పాల్గొన్నారు.
కోటప్ప తిరునాళ్ళలో వందేమాతర గేయం కోలాటమాడింది. ఆ ఉత్సవంలో ఎద్దుల బళ్ళపై ప్రభలు కట్టుకొని వందేమాతర గేయం ఆలపిస్తూ పాల్గొన్నారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో ఒక ఎద్దు మరణించింది. ఆ బండి నడుపుతున్న చిన్నపరెడ్డి.. కాల్పుపు జరిపిన ఆంగ్లేయుని బలంగా కొట్టాడు. తరువాత ఆయనకు ఉరిశిక్ష విధించారు. కింగ్స్ ఫోర్డు హత్యాయత్న కేసులో 1908 లో ఖుదీరామ్ కు ఉరిశిక్ష విధించారు. 18 ఏళ్ళ ఖుదీరామ్ ను చివరి కోరిక ఏమిటని అడగగా, నవ్వుతూ వందేమాతరం పాడుకుంటూ ఉరికంబాన్ని ఎక్కాడు.
ఆ బాలుని భౌతిక కాయం కలకత్తా వీధులలో లక్షలాది గొంతుల వందేమాతర ఉద్రేక తరంగాలలో తేలిపోయింది. ఎన్ని గొంతులు నొక్కినా, లాఠీలు విరిగినా వందేమాతర రణ గేయం ఆగలేదు. సైనికులు వ్రేళ్ళు చితక్కొట్టినా ఉప్పు సత్యాగ్రహంలో పిడికిట బిగించిన ఉప్పు మాత్రం వందేమాతర నినాదంతో నేల రాలలేదు. ఉప్పు కొలిమలలోకి విసిరి వేస్తన్నా కాలిపోయే వరకూ వందేమాతర నినాదం విడిచిపోలేదు.
ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు వందేమాతర ఉద్యమంలో బహిష్కరణకు గురయ్యారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలామ్ అజాద్, టంగుటూరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు మొదలైన దేశభక్తుల గళంలో మారుమ్రోగింది ఈ వందేమాతరం. 1947లో స్వాతంత్ర్య సమర విజయగీతంగా ఆకాశవాణి ప్రపారం చేసి, నేటికీ తమ సుప్రభాత గేయంగా వందేమాతరాన్ని విడవలేదు. ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో “వందేమాతరం” రెండో స్థానం దక్కించుకుంది.
వందేమాతరం అంటే మనకు జన్మనిచ్చిన తల్లికి కృతజ్ఞతాపూర్వక వందనం సమర్పించినట్లు భావన. భారతదేశ చరిత్ర లో “వందేమాతరం” ఒక ఉద్వేగ పూర్విత స్మృతినినాదం. ఈ పుడమి ఉన్నంత వరకు తరాలు మారినా వందేమాతరం మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
వందేమాతరం వందేమాతరం వందేమాతరం..
-వారణాశి వెంకట హర్య కామేశ్వరరావు
2.మనసు-మాట శీర్షిక

ఈ వారం అనిల్ మనసు-మాట తెలుసుకుందామా?
అనిల్ మనసు-మాట: నేను 24 ఏళ్ళ వయసు గల మధ్య తరగతి అబ్బాయిని. నేను 8వ తరగతి వరకు మా గ్రామంలో చదువుకున్న తర్వాత హైదరాబాద్లోని స్కూల్ మరియు కాలేజీ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. నేను ఐఐటీ ఢిల్లీ నుంచీ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. చదువు అయిన వెంటనే మంచి ఉద్యోగం వచ్చింది. నా జీవితం బయటకి చాలా ఆనందంగా అనిపిస్తుంది, అందరికీ-డ్రీం లైఫ్.నేను ఈ స్థాయికి రావటానికి పడిన కష్టం నాకు మాత్రమే తెలుసు.
ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే అందరి కంటే ముందుoడాలి అనే తాపత్రయంతో చదువుకొని అన్నీ సాధించాను. ఇప్పుడు నా ఈ దృక్పధం నేను చేస్తున్న ఉద్యోగానికి అడ్డంకవుతుంది. వృత్తి రీత్యా నేను టీంకి నాయకత్వం వహిస్తున్నాను. నా టీం లో ఎవరైనా మంచిగా పని చేస్తే నేను వేస్ట్ అనిపిస్తుంది లేదా వాళ్లతో పోటీపడ్తుంట. అలాగే నా మేనేజర్కి నా గురించి మంచి అభిప్రాయo వుందా లేదా అని అనుక్షణం ఆలోచిస్తూ వుంటా. మిగిలిన వాళ్ళు నాకంటే బెటర్ అన్న భయం నన్ను ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటుంది. అందుకే ప్రతీ చోట ఎక్కువ కష్టపడతా.ఇది ఎలా పోగొట్టుకోవాలి?
సైకాలజిస్ట్ మాట: అనిల్ మీరు అనుభవిస్తున్నది స్వీయ సందేహం(self-doubt).
అనిల్ కి ఏమి జరుగుతుంది:
అనుమానం ఉన్నప్పుడు నమ్మకానికి చోటు ఉండదు. అందుకే మీరు అనుక్షణం మిమ్మల్ని మీరు రిజెక్ట్ (self-rejection) చేసుకుంటూ వుంటారు. ఈ రిజెక్షన్లో భాగమే ఇతరులతో పోల్చుకోవడం వాళ్ళ విజయాలు వలన భయపడటం, మీ విజయాలను మరిచి పరాజయాలు మీద దృష్టి పెట్టడం,మీకు తెలియదు/రాదు అని ఒప్పుకోలేకపోవడం, తప్పు చేస్తే మీ సామర్ధ్యతని ప్రశ్నించుకోవడం, ఇతరులకు లోకువ అయిపోతాను అని భయపడడం, పెర్ఫెక్షనిసమ్ ( Perfectionism ) ఎక్కువవడం వంటివి. చిన్న తప్పు జరిగినా మిమల్ని మీరు నిందించుకోవడం,ఎంత చేసిన సరిపోదు ఇంకా కొదవ వుంది అనిపించడం స్వీయ సందేహం వలన ఏర్పడే వెలితి యొక్క సూచికలు. ఈ వెలితి వలనే మీ మీద మీకు నమ్మకం (self-belief) తగ్గుతుంది తద్వారా ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.
అనిల్ కి సూచనలు: ఆత్మ విశ్వాశాన్ని పెంచుకోవడానికి మీరు చేయాల్సినవి:
1.మిమల్ని మీరు మెచ్చు కోవడం మీ బలాలను గ్రహించుకోవడం.
2 మీకు రాదు/తెలియదు అని చెప్పగల్గాలి.
3.తప్పులు భయపడకుండా చేయటం అప్పుడే మీరు నేర్చుకుంటున్నట్టు.
4.ఇతరులతో పోటీ పడకుండా, సహకరించడం వలన టీంతో పాటు మీరు వృద్ధి చెందుతారు.
5.చిన్న-చిన్న విజయాలని ఆనందించండి. పరాజయాలను ఎక్కువగా విశ్లేషిన్చకండి
6.మీ గురించి మీకున్న అసహాయకరమైన నమ్మకాలను(unhelpful self-beliefs)గమనించి వాటిని సహాయకరమైన (Helpful self-beliefs)నమ్మకాలుగా మార్చుకోవాలి.
7.మీ నమ్మకాలను-భావాలను వేరు చేసి, ఫాక్ట్స్ మీద దృష్టి పెట్టండి.
8 ఇతరులతో మీ భావాలను పంచుకోండి.
9 మీ టీం పని తనంలో మీకు నచ్చింది అందరి మధ్య మెచ్చుకోండి.
10.ఎవరైనా మీ తప్పులు ఎత్తి చూపించినపుడు వాటిల్లో ఏవి మార్చుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. అన్నీ మార్చుకోవాలని లేదు ఎంత వీలు పడితే అంత మార్పుకు ప్రయత్నించండి.
11 ఇతరుల నుంచి నేర్చుకోవటానికి సంకోచ్చించకండి, ఆలా నేర్చుకోవటానికి మనము ఎల్లప్పుడూ సిద్ధం అనే దృక్పధమే ఆత్మవిశ్వాసానికి పునాది.
ది మైండ్ వాయిస్: అనిల్ మీరు చెప్పుకోవాల్సిన మనసు -మాటలు :
- “నాకు అన్నీ తెలియాలి/రావాలి అన్నది ఆత్మ విశ్వాసం కాదు. నేను ఎల్లప్పుడూ నేర్చుకోవటానికి మరియు నేర్పించటానికి సిద్ధం అన్నది ఆత్మవిశ్వాసం”
- “ఆత్మవిశ్వాసం కార్యాలు(actions) వలన వస్తుంది ఆలోచనలు వలన కాదు. పుట్టుకతో ఎవరికీ ఈ స్కిల్ ఉండదు నేర్చుకుంటేనే వస్తుంది”.
3.మర్యాద – మర్యాద (కథ)

రాఘవయ్య పేపర్ చదువుతున్నాడు. నాల్గవ తరగతి చదివే అతని మనుమడు పార్థు స్కూలుకు బయలుదేరుతున్నాడు. “తల చక్కగా దువ్వుకుని వెళ్ళు. లేకుంటే నిన్ను చూసి నీ స్నేహితులందరూ చింపాంజీ వచ్చిందని అనుకుంటారు.” పార్థుపై ఛలోక్తి విసిరాడు రాఘవయ్య. “తాతయ్యా! మధ్యాహ్నం నాకు కేరేజీ పట్టుకుని వచ్చేటప్పుడు నీ తలకు టోపీ పెట్టుకోవడం మరచిపోకు. లేకుంటే నీ బట్టతల చూసి, ప్లే గ్రౌండ్ అనుకుని పొరబడుతారు నా స్నేహితులు.” తిరిగి అంతే మోతాదులో తాతయ్య పై ఛలోక్తి విసిరాడు పార్థు. వారిద్దరి ఛలోక్తులు చూసి పార్థు వాళ్ళ తల్లిదండ్రులు నవ్వుకున్నారు. రాఘవయ్య, పార్థు తాతామనవళ్లు అయినప్పటికీ, చాలా సరదాగా ఉంటారు. వారిద్దరి ఛలోక్తులతో ఆ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు పూస్తాయి.
ఒకరోజు రాఘవయ్యను కలవడానికి రాఘవయ్య స్నేహితుడైన మునిరామయ్య వచ్చాడు. అప్పుడే స్కూల్ నుండి వచ్చిన పార్థును చూసి “పార్థు! చెరుకు గడలా అలా బక్కచిక్కి పోయావేంట్రా?” అంటూ అడిగారు మునిరామయ్య. “పెద్దయ్యేసరికి చెరుకు లారీలా లావుగా, మీకులాగా అవకూడదని డైటింగ్ చేస్తున్నా తాతయ్యా!” అంటూ మునిరామయ్యకు సరదాగా సమాధానం చెప్పాడు పార్థు. చిన్న పిల్లవాడైన పార్థు తన ఆకారాన్ని చూసి ఎగతాళిగా మాట్లాడేసరికి మునిరామయ్య నొచ్చుకుని వెళ్లిపోయాడు.
ఇంటికి వచ్చిన అతిధుల పట్ల పార్థు ప్రవర్తన చూసి, పార్థును గట్టిగా మందలించారు అతని తల్లిదండ్రులు. “ఇప్పుడు నేనేం తప్పు చేశానని? తాతయ్యతో మాట్లాడినట్టే మునిరామయ్య గారితో కూడా సరదాగా మాట్లాడాను. అంతే కదా?” ప్రశ్నించాడు పార్థు. రాఘవయ్య పార్థును దగ్గరకు తీసుకుని ఒక చిన్న కథ చెప్పడం మొదలుపెట్టాడు. “నా చిన్నప్పుడు ఒకసారి మా అమ్మ నా కోసం ఒక కుక్కపిల్లను తెచ్చింది. దానికి టామీ అని పేరుపెట్టాను. కొన్ని రోజుల్లోనే టామీతో నాకు మంచి స్నేహం కుదిరింది. అప్పుడప్పుడూ ఇంటికి మా నాన్నగారి స్నేహితులు వచ్చేవారు. వారిని టామీ చాలాసార్లు చూసింది కూడా. ఎందుకో తెలియదు గానీ, ఒకరోజు మా నాన్నగారి స్నేహితులను చూసి టామీ గట్టిగా మొరగడం మొదలుపెట్టింది.
దాంతో మా నాన్నకు టామీపై చాలా కోపం వచ్చింది. కర్రతో దాన్ని కొట్టాడు. నాకు చాలా బాధనిపించింది. ఆ రాత్రి అందరూ పడుకున్నాం. అర్థరాత్రి టామీ మళ్ళీ మొరగడం మొదలుపెట్టింది. నాకు కాస్త మెలుకువ వచ్చింది. మా నాన్న టామీను మళ్ళీ కర్రతో కొడతాడేమో అనిపించిది. అర్థరాత్రి కావడంతో ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నా. మర్నాడు నిద్రలేచే సరికి మా నాన్న టామీను ప్రేమగా నిమురుతూ బిస్కెట్లు తినిపిస్తున్నాడు. టామీపై కోపాన్ని ప్రదర్శిస్తాడనుకున్న నాన్న దానిపై ప్రేమ కురిపించడం చూసి ఆశ్చర్యపోయాను.
ఏతావాతా నాకు తెలిసిందేంటంటే ఆ రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారట. టామీ అరుపులతో మా నాన్న నిద్రలేచారట. మా నాన్నను చూసి దొంగలు పారిపోయారట.” రాఘవయ్య చెప్పింది చాలా జాగ్రత్తగా విన్నాడు పార్థు. “ఆ సంఘటన వల్ల అప్పుడు నాకు అర్థమయ్యింది ఏంటంటే, ముందు రోజు మా నాన్న టామీపై కొప్పడింది అది మొరిగినందుకు కాదు! ఎవర్ని చూసి మొరగాలి, ఎవర్ని చూసి మొరగకూడదు అనే విషయం తెలుసుకోలేక పోయినందుకు.” అంటూ ముగించాడు రాఘవయ్య.
రాఘవయ్య చెప్పిన కథాసారం పార్థుకు భోదపడింది. మునిరామయ్య విషయంలో తన తండ్రి తనను ఎందుకు కొప్పడ్డాడో తెలుసుకున్నాడు. ఇంట్లో వారితో వ్యవహరించినట్టు అతిధులతో, కొత్తవారితో వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నాడు. ”తాతయ్య! ఇకపై మన ఇంటికి వచ్చే అతిధుల పట్ల నేను మర్యాదగా వ్యవహరిస్తాను. వారిపై సరదాకైనా ఛలోక్తులు విసరను. నేను స్వయంగా వెళ్ళి, మునిరామయ్య గారికి క్షమాపణ చెబుతాను.” అన్నాడు పార్థు. పార్థులో వచ్చిన మార్పు చూసి రాఘవయ్య చాలా సంతోషపడ్డాడు. “మీ అందరితో మాత్రం ఎప్పటిలాగే సరదాగా ఉంటాను.” బుంగమూతి పెట్టి అడిగాడు పార్థు. “అలాగే!” అంటూ పార్థును దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టాడు రాఘవయ్య.
(పేట యుగంధర్, వెదురుకుప్పం – 9492571731)
4.కబుర్లు- శీర్షిక

చిన్నారుల పండుగ
కరెంటు బల్బు కనుక్కున్న థామస్ అల్వా ఎడిసన్ చిన్నప్పుడు పొదగటానికి కోడిగుడ్డు మీద కూర్చున్నాడట. పెద్దయిన తరువాత ఎవరెంత పెద్దాళ్ళయినా చిన్నతనంలో అంతా చిన్నాళ్ళే!
శ్రీరాముడు బాలుడుగా ఉన్నప్పుడు చందమామకోసం మారాం చేశాడని మీకు తెలుసా ?
కలాంగారెంత గొప్పవారైనా కళ్ళు తెరచుకుని తుమ్మలేరుగదా! చందమామను అందుకున్న నీల్ ఆమ్ స్ట్రాంగ్ సొంత చేత్తో స్వయంగా వీపు తడుముకోగలడా?
‘పెద్దరికం’ అంటారుగానీ పెద్దమహా .. ఆదివారం నుంచీ శనివారం దాకా వారం పేరు రాకుండా ఏడు రోజుల పేర్లు చెప్పండి చూద్దాం! ఏడుపు మొగమేసేశారు గదా ? అటుమొన్న , మొన్న, నిన్న, ఇవాళ, రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి .. ఈ ఏడూ పేరు లేని ఏడు రోజులు కదండీ! ?
చిన్ని ప్రన్నలక్కూ డా అలా తెల్లమొగం వేస్తారేంటండీ? కాస్త నవ్వుకొందురూ! మేం పిల్లలం రోజుకు మినిమమ్ మూడొందల సార్లు హాయిగా నవ్వుకుంటాం. అందులో కనీసం మూడో వంతైనా మీ పెద్దాళ్ళు నవ్వుకోని పక్షంలో – ఇదిగో ఇలాగే బీపీలూ, గుండె జబ్బులూ ముంచుకొచ్చి వాటికి ‘రాజకీయాలని’ పేరు పెట్టి బతుకు రొచ్చు రొచ్చు చేసుకుంటారు.
వేలెడంత లేవు. నువ్వా మాకు చెప్పొచ్చేదని అలా వేళాకోళాలొద్దు! మరి అమెరికాలో వందకు యాభై అయిదు మంది పెద్దాళ్ళు సూర్యుడు ఒక పెద్ద నక్ష త్రమ’ ని అన్నా ‘ఛ… మేం నమ్మం పొమ్మ’ని బుకాయించేస్తున్నారు! ఇదేనా ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మీ పెద్దల విజ్ఞానం!
ఏనుగుకన్న ఎలుక గొప్పది! ఎందుకో చెప్పండి చూద్దాం! తెల్ల మొగం వేస్తారేం అలా ? మీవి పేద్ధ బుర్రలు కదా! నేను చెప్పనా? ఏనుగు ఎలుకలా కంతలో దూరలేదు. ఏ కలుగులోనూ దాక్కోలేదు. ఇప్పుడైనా ఒప్పుకుంటారా మా గడుగ్గాయిల ముందు మీ వాగుళ్ళూ గూగుళ్ళూ బలాదూర్ అని ఆంటీసూ అంకుల్సూ !
ఇంకా ఐన్ స్టీన్ కన్నా ఐన్స్టీన్ తండ్రే ఇంటలిజెంటని దబాయిస్తూనే ఉంటారా ? మీ పెద్దాళ్ళే అంత స్మార్ట్ గ్రెస్ అయితే స్కూలు బస్సులు కామన్ గా పసుపు రంగులోనే ఎందుకుంటాయో చెప్పండి చూద్దాం! హారర్ సినిమాలు చూసేటప్పుడు పాప్ కార్న్ ఎక్కువెందుకు మెక్కుతారో సెలవివ్వండి! టెన్నిస్ గురించి అంతా తెలుసని గొప్పలు పోతారు గదా మీ పెద్దలు ? టెన్నిస్ ఆడే ఆ రాకెట్ కు రంధ్రాలెన్ని ఉంటాయో చెప్పగలరా?
బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తారేం ఎల్డర్సూ! సరే.. ఈ ప్రశ్నకైనా సరిగ్గా సమాధానం చెప్పి సరే అనిపించుకోండి! పలకముందా .. బలపం ముందా? ఇదేం క్వశ్చన్ .. గాడిద గుడ్డు అంటారా ?గాడిద గుడ్డు అంటే అసలేంటి ? అదైనా వివరించండి! అద్గదీ వరస! తెలీకపోతే తెలీనట్లుండాలి! ఎదురుదాడి ఎందుకంట! ఇదేమైనా మీరు టీవీ పెట్టెల్లో కూలబడి చేసే రాజకీయ రచ్చలా?
ఏంటీ.. మాటి మాటికీ రాజకీయాలు అంటున్నాం అనుకుంటున్నారా? మీ పెద్దాళ్ళంతా కలిసి చేసే ఎన్నికల గోల మాత్రమే రాజకీయం అనుకోవాలా? కప్పల్ని చూసి జడుసుకునే వాళ్ళే ఎక్కువనుకుంటారు మీ పెద్దోళ్ళు. కాదు సుమా! పూటకో పార్టీలోకి దూకే వెంకప్పలను చూసి ఇంకా ఎక్కువ జడుసుకుంటున్నారు! కామన్ సెన్సు కరువయ్యే మీ పెద్దాళ్ళకు ఇలా బోలెడన్ని భ్రమలు!
అన్నట్లు.. మా ఇంట్లో కూడా చాలా పార్టీలే ఉన్నాయి. మా బామ్మది అధికారపార్టీ. అమ్మది ప్రత్యేక పార్టీ . ఎప్పుడు మిఠాయి చేసినా విడిగా వేరే డబ్బాలో దాచుతుంది .. ఎందుకో? మానాన్నకు మాత్రం ప్రత్యేకం ఇదీ నా పార్టీ అని లేదు. ఒక్కో సారి బామ్మ పార్టీ, ఇంకోసారి అమ్మపార్టీ. మా బాబాయిది టీపార్టీ. ఎప్పుడు చూసినా స్టేట్ గవర్నమెంటును , సెంట్రల్ గవర్నమెంటును నిధులు అడిగినట్లు డబ్బుల కోసం నాన్నను వేధిస్తూ ఉంటాడు.
నా పార్టీ ఆభాస అంటే- అఖిలభారత బాలల సమితి.
తమ్ముడిది దోబాస అంటే- దోగాడే బాలల సమితి. పసిపిల్లలకు పార్టీలేంటని అలా విసుక్కోకండి మరి! పీత బాధలు పీతవి.. మా పిల్లల బాధలు మావి.
మేమేన్నా టైంపాసుకు పార్టీలు పెట్టామా? దోమలు పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లల్నే ఎందుకు ఎక్కువగా కుడతాయో తేల్చమని ఎన్నేళ్ళ బట్టి పెద్దపార్టీలను అడుగుతున్నాం? ఏదీ .. పట్టించుకుంటేగా? నేటి పౌరుడు నిన్నటి బాలుడేగా!
బాలల బాధలు అర్ధం చేసుకోకపోతే ఎలా? స్కూలు బ్యాగులు రోజురోజుకు బరువెక్కుతున్నాయి. పాకెట్ మనీ అంతకంతకూ చిక్కిపోతోంది! మా ‘క’ భాషను అధికారభాషగా గుర్తించమని ఎన్ని ఏళ్లుగా మొత్తకుం టున్నాం! మా ముద్దులకు కనీస మద్దతుధర పెంచాలి. పరీక్షలు పర్మినెంటుగా వాయిదా వెయ్యాలి. అక్బరుకేమన్నా అ.. ఆ లొచ్చా? బీర్బల్ కి ఏబీసీడీలొచ్చా? ఎందుకొచ్చిన హోంవర్కులివి! ప్రోగ్రెస్ రిపోర్టుల మీద సొంతంగా సంతకం చేసుకునే హక్కు దక్కాలి. పరీక్షలో తెలియని ప్రశ్నలు అడక్కూడదు. ఏ సమాధానం రాసినా సమానంగా పాసు మార్కులు వేస్తేనే సమన్యాయం జరిగినట్లులెక్క . ఆడుకునే సమయం పెంచాలి. టీవీ చూసే టైం మీద ఆంక్షలు సడలించాలి. పెద్దలకు ఏ సర్టిఫికేట్ సినిమాలు తీస్తున్నట్లే పిల్లలకూ ‘బి’ సర్టిఫికేట్ చిత్రాలు నిర్మించాలి. పిల్లలకు సున్ని ఉండలు కొనుక్కో డానికి సున్నా వడ్డీ రుణాలు ఇప్పించాలి. మూడు నెలలు దాటిన బాలలందరికీ పింఛను సౌకర్యం కల్పించాలి. బట్టల మీది బడ్జెట్ కేటాయింపులను చిరుతిళ్ల మీదకు మళ్ళించాలి.
అల్లరే మా అజెండా! ఎండు కుండీల బండి చక్రం మా జెండా గుర్తు. రాళ్ళేసిన డబ్బాల ద్వారా మా పార్టీ ప్రణాళికను ప్రచారం చేయాలని ప్లాన్. మా విధానాలు నచ్చిన ఏ పార్టీతో అయినా కూటమి కట్టడానికి రెడీ.
బాలల సమస్యలను పట్టించుకోని పార్టీ లను గోడకుర్చీ వేయిస్తాం. బబుల్ గమ్ము లాగా మా సమ స్యలను నానుస్తామంటే సహించేది లేదు. మాకు మదర్ థెరిసాలే కాదు. ఫాదర్ థెరిస్సా, బ్రదర్ థెరిస్సాలూ కావాలిప్పుడు.
నేనే గనక ముఖ్యమంత్రి అయితే ‘బాలలకో కార్పొరేషన్ ‘ ప్రత్యేకంగా ప్రారంభిస్తా. ‘కప్పు రెండు రూపాయల’ పథకం రద్దుచేసి కోరినంత ఐస్ క్రీం ఉచితంగా ఇచ్చేస్తా! నా మొదటి సంతకం ఈ దస్త్రం మీదే! మొదటి సంతకం చేస్తా! జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా రేపటి పౌరులు అందరికీ అభినందనలు! లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ . . పీఠం ఎక్కిన ఫస్ట్ డేనే ‘చింటూ’కి బాలరత్న అవార్డు ప్రకటిస్తాం. అసలు ఈ ‘చింటూ’ ఎవరంటారా? ఇంకెవరూ .. నేనే!
5.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

దూరపు కొండలు నునుపు
దూరంగా ఉన్నకొండలు నునుపుగా కనిపిస్తాయి. దగ్గరగా ఉన్నవి? గరుకుగా కనిపిస్తాయి! దీని భావమేమి తిరుమలేశ! మన ప్రతి సామెతలో ఎంతో లోతైన లౌకిక, పారమార్థిక జ్ఞానం దాగి ఉంటుంది. దాన్ని మూడే మూడు ముక్కల్లో చెప్పడమే సామెత ప్రత్యేకత.
దీనికి సమాంతరమైనదే సంస్కృతంలో ఉంది. దానిని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే సెలవిచ్చాడు. అది మీకు బాగా తెలిసిందే సుమండీ! ‘స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః’.ఇక్కడ పరధర్మమంటే దూరపుకొండ అన్న మాట. స్వధర్మంలో ‘నిధనం’ అంటే ఆదాయం లేకపోయినా పరవాలేదు. కాని పరధర్మం భయాన్ని కలిగిస్తుంది.నిధనం అంటే మరణం అని కూడా అంటారు. కానీ మనం అంత దూరం వెళ్ళనక్కరలేదు.
పెద్ద పెద్ద చదువులు ఇక్కడ చదివి, అవి చాలక, యు.ఎస్.లో ఎమ్.ఎస్. చేసి, ఉద్యోగాలు వచ్చేంత వరకు చిన్నా చితకా ఉద్యోగాలు చేసి నానా అవస్థా పడుతుంటారు మనవాళ్లు చాలామంది. తల్లిదండ్రులు ఇక్కడ ఒంటరివాళ్లయి పోతారు. “నాకు హార్ట్ ఎటాక్ వచ్చి హస్పిటల్‌లో చేరినప్పుడు కూడా మావాడు రాలేదు తెలుసాండీ!” అని గర్వంగా చెప్పుకుంటారు కొందరు. ఐ పిటీ దెమ్. రూపాయల్లోకి మారిస్తే జీతం ‘ఇంత’ అనిపిస్తుంది కాని, డాలర్లలో ‘గొర్రె తోక బెత్తెడే’. చక్కగా స్వదేశంలో ఒక మోస్తరు ఉద్యోగం చేసుకుంటూ, ఉన్న దానితో తృప్తిపడేవాడే ధన్యుడు.
ఏదైనా వస్తువునుగాని, ప్రదేశాన్ని గాని దగ్గరకు వెళ్ళి గమనించాలి. అప్పుడే వాటి అసలు రంగు బయట పడుతుంది. దూరం నుంచి కొండ నున్నగానే కనబతుతుంది. కాని దాని నిండా రాళ్ళూరప్పలు, బండలు, ఎగుడు దిగుళ్ళు, చెట్లు చేమలు! మన జీవితం కూడా అంతే! తెల్లకాలరు వారిని అలా ఉంచితే, నల్లకాలరు (అదేనండీ కార్మికులు) వాళ్ళల్లో గల్ఫ్ కంట్రీస్‌కు పోయి బతకాలని, నాలుగు రాళ్ళు (డబ్బండీ బాబు!) సంపాదించుకోవాలని ఆశపడతారు. కాని, బ్రోకర్ల మోసాలకు బలవుతారు. వెళ్ళగలిగినవాళ్ళు, వెట్టి చాకిరీ చేస్తారు. దుర్భరమైన జీవితం!
సోషియల్ మీడియాలో సమీక్షలు చదివి, సినిమాలకు వెళ్లడం కూడా ఇంచుమించు ఇలాంటిందే. ఆ సమీక్షల్లో, ఆ సినిమాలు ‘నునుపు’ గానీ ఉంటాయి. తీరా బోలెడు డబ్బు తగలేసి టికెట్టు కొని, ఆ కళాఖండాన్ని చూశామనుకోండి! ‘చిత్రహింస’ తప్పదు.
ఫేస్‌బుక్ మేధావులు అన్నీ తమ రంగు కళ్లద్దాలతో చూసి సుదీర్ఘ పోస్టులు పెడుతుంటారు. సినిమాలు, రాజకీయాలు, సాహిత్యం దగ్గర నుంచి ప్రయివేటు వోల్వో బస్సులు కాలిపోవడం వరకు – ‘అన్నీ’ వీళ్ళ జ్ఞాన పరిధి లోకి వస్తాయి. కాని వీళ్లు చెప్పేవి నిజానికి అంత నునుపుగా ఉండవు. వారి వారి రాజకీయ, సాహిత్య, ఇతరత్రా ‘విధేయత’లను బట్టి ఉంటాయి. వాటిని ‘దూరపు కొండలు’ గానే భావించాలి.
పల్లెలో ఉన్నవాడికి ‘నగర జీవితం’ నునుపుగా మెరుస్తూ కనబడుతుంది. దీనినే, ‘తోడికోడళ్ళు’ (1957) సినిమాలో కొసరాజు రాఘవయ్య చౌదరిగారు.. ‘టౌను పక్కకెళ్లొద్దురా డింగరీ, డాంబికాలు పోవద్దురా’ అన్న పాటలో అద్భుతంగా ఆవిష్కరించారు. టౌనులో బ్రతికితే ఉన్న సుఖాలు అక్కినేని చెబితే, అవి ఎంత దుఃఖాలో సావిత్రి చెబుతూ ఉంటుంది. ‘విరోధాభాసాలంకారాన్ని’ కొసరాజుగారు జనసామాన్యం మెచ్చే భాషలో వ్రాశారు. అలాంటి పాటలు వ్రాయడంలో ఆయన దిట్ట.
ఇతరులతో పోల్చుకొని, మనం వాళ్ళలా లేమే అని బాధపడుతుంటాం. వాళ్ళకూ బాధలుంటాయి. మనకు తెలియవు. అంతే! అన్ని దుఃఖాలకు మూల కారణం ‘పోల్చి చూచుకోవడమే’ అని ప్రముఖ ఆంగ్ల రచయిత ఫ్రాన్సిస్ బేకన్ అన్నారు. మల్టీప్లెక్సుల్లో, ఆడంబరంగావస్తువులను ప్రదర్శించి, వినియోగదారులను ఆకర్షిస్తారు. నిజానికి అవి అంత గొప్పవి కాదు. గొప్ప కోసం, పోష్‌గా ఉన్న ఎ.సి. రెస్టారెంటుకు వెళితే, చట్నీలు ఫ్రిజ్‌లో పెట్టినవి ఇస్తారు. తిండి పరమ ఘోరంగా ఉంటుంది. మన వీధిలోనే ఉన్న టిఫిన్ బండి మనకంటికి ఆనదు. కాబట్టి, తస్మాత్, సో, జాగ్రత్త మిత్రులారా!
వచ్చే వారం ఇంకో సామెతతో కలుద్దాం.
6.వినరో భాగ్యము – శీర్షిక

శ్రీవారి ఆవిర్భావ చరిత్ర
వివిధ పురాణల్లోని అంశాల ఆధారంగా తిరుమలేశుడు శేషాచలంపై స్వయంభువు గా వెలసి28 మహాయుగాలు గడిచాయని తెలుస్తోంది. ఆ లెక్కల ప్రకారం 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగానికి సమానం. ఆ వివరాల మేరకు ప్రస్తుతం 19,980,000 సంవత్సరాలు అయినట్టు తెలుస్తోంది. ఆధునిక ఇతిహాసాల ఆధారంగా అయితే క్రీస్తు పూర్వం నుంచే తిరుమల కొండకోనల్లో తొండమాన్ చక్రవర్తి నిర్మించిన స్వామివారి ఆలయం ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తిరుమల విశేషాలతో మళ్ళీ వచ్చేవారం కలుద్దాం.
మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్
ఐడి. prabhanewscontent@gmail.com


