అనంతగిరి జీవవైవిధ్యంపై ప్రాజెక్టుల ముప్పు

అనంతగిరి జీవవైవిధ్యంపై ప్రాజెక్టుల ముప్పు

  • అనంతగిరిలో కేంద్ర, రాష్ట్ర ప్రాజెక్టులతో పెరుగుతున్న ఆందోళన
  • రాడార్ స్టేషన్ కోసం వేల ఎకరాల అడవి.. లక్షలాది చెట్ల తొలగింపు
  • మేఘా వెల్నెస్ రిట్రీట్, బుల్లెట్ రైలు ప్రాజెక్టులతో భూసేకరణ
  • జీవవైవిధ్యం, పర్యాటక అందాలపై ముప్పు తప్పదా?
  • అనంతగిరి సొరంగ మార్గం, బుల్లెట్ రైలు స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు

వికారాబాద్ జిల్లా, ఆంధ్రప్రభ ప్రతినిధి: తెలంగాణ ఊటీగా గుర్తింపు పొందిన అనంతగిరి క్షేత్రం కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రాజెక్టులకు ఎంపిక చేయడంతో జీవవైవిధ్యం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

గతేడాది అనంతగిరి క్షేత్రంలో భాగమైన దామగుండం అడవుల్లో దాదాపు మూడు వేల ఎకరాలను వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణానికి విశాఖపట్నం తూర్పు నావికాదళానికి కేటాయించారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 12 లక్షల వృక్షాలను తొలగించాల్సి రావడంతో దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం రాడార్ స్టేషన్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పర్యాటక విధానంలో భాగంగా ప్రముఖ మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థ మేఘాతో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతగిరిలో రూ.1,021 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ వెల్నెస్ రిట్రీట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు 80 ఎకరాల భూమిని మేఘా సంస్థకు కేటాయించింది. ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో రిసార్ట్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

తాజాగా హైదరాబాద్–ముంబై కారిడార్‌లో ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టు మార్గం కూడా అనంతగిరి మీదుగానే వెళుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బుల్లెట్ రైలు స్టేషన్ అనంతగిరిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో స్టేషన్ నిర్మాణానికి దాదాపు 245 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు సమాచారం.

అంతేకాకుండా బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం కోసం అనంతగిరి కొండలో 4.5 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించనున్నారు. వరుసగా కేంద్ర, రాష్ట్ర మెగా ప్రాజెక్టులు అనంతగిరిలో అమలు కావడంతో తెలంగాణ ఊటీగా పేరొందిన ఈ ప్రాంతం జీవవైవిధ్యానికి ముప్పు, సహజ అందాలు అంతర్ధానం అయ్యే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.