accident| ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి ఘాట్‌ రోడ్డులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు

సమాచారం అందుకున్న వెంటనే వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దీపక్‌ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించిన ఎస్పీ.. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

అనంతగిరి ఘాట్‌ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.