ఎన్నికల విధుల్లో ఉండగానే కుప్పకూలిన ఉపాధ్యాయురాలు
పోలింగ్ కేంద్రంలోనే తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలించేలోపే మృతి
అనంతపురం, ఆంధ్రప్రభ: ఎన్నికల విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. కూడేరు మండలం కడదరుకుంటలో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరైన ఎస్జీటీ ఉపాధ్యాయురాలు హరిత గౌడ్ పోలింగ్ కేంద్రంలోనే అస్వస్థతకు గురయ్యారు.
రాయదుర్గం మండలం ఖాదలూరులో విధులు నిర్వహిస్తున్న హరిత గౌడ్ ఎన్నికల విధుల నిమిత్తం కడదరుకుంటకు వచ్చారు. ఈ క్రమంలో బీపీ, షుగర్ స్థాయిలు తగ్గడంతో ఆమెకు ఆయాసం పెరిగింది. వెంటనే ఆమెను కూడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
