రాప్తాడు దాడి కేసులో కీలక పరిణామం..

నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు!

  • ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఘటన
  • పోలీసులపై రాళ్లతో దాడి చేసిన నిందితుడు
  • ఆత్మరక్షణ కోసం ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు
  • తీవ్ర గాయాలతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

అనంతపురం క్రైమ్‌, ఆంధ్రప్రభ : రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై మోటరైజ్డ్‌ రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌ (21) పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులపై రాళ్లతో దాడి

విద్యార్థినిపై దాడి చేసిన అనంతరం పరారైన హేమంత్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడు దాక్కున్నట్లు సమాచారం అందడంతో పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని చుట్టుముట్టాయి. పోలీసులను గమనించిన హేమంత్‌ లొంగిపోకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లతో దాడి చేయడంతో కొందరు సిబ్బందికి గాయాలయ్యాయి.

ఆరు రౌండ్ల కాల్పులు

హేమంత్‌ను పోలీసులు హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గలేదు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. బుల్లెట్లు తగలడంతో హేమంత్‌ తీవ్రంగా గాయపడి, రక్తస్రావానికి గురయ్యాడు. వెంటనే అతడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.