భారీ వర్షాల నేపథ్యంలో ఆనందపురం–గుర్ల రహదారిపై జెసి పరిశీలన
లోతట్టు ప్రాంతం, కల్వర్టు వద్ద పరిస్థితిపై అధికారులకు ఆదేశాలు
విజయనగరం/గుర్ల, ఆంధ్రప్రభ : భారీ వర్షాల నేపథ్యంలో ఆనందపురం–గుర్ల గ్రామ రహదారిలోని లోతట్టు ప్రాంతం, కల్వర్టును సంయుక్త కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారిపై వర్షపు నీటి ప్రవాహం, ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కల్వర్టు వద్ద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటి ప్రవాహం పెరిగితే వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. పరిస్థితి తీవ్రతను బట్టి అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జెసి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
