Rachita Ram : హీరోయిన్ రచిత రామ్‌కు ఊహించని షాక్…!

Rachita Ram : హీరోయిన్ రచిత రామ్‌కు ఊహించని షాక్…!

Rachita Ram : కన్నడ సినీ నటి, ‘డింపుల్‌ క్వీన్‌’గా అభిమానుల్లో గుర్తింపు పొందిన రచితా రామ్‌కు తన పుట్టినరోజు వేడుకల్లో ఊహించని అనుభవం ఎదురైంది. అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న సమయంలో ఓ యువకుడు ఆమె రెండు బుగ్గలను గిల్లడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రతి ఏడాది అక్టోబర్‌ 3న పుట్టినరోజు సందర్భంగా రచితా రామ్‌ అభిమానులను కలుసుకుంటూ సెల్ఫీలు దిగుతుంటారు. ఈ ఏడాది కూడా బెంగళూరులో అభిమానులతో కలిసి ఆమె పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆమెతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

అయితే ఓ యువకుడు రచితా రామ్‌తో సెల్ఫీ దిగిన అనంతరం అనూహ్యంగా ఆమె రెండు బుగ్గలను చేతులతో గిల్లాడు. ఊహించని ఈ చర్యతో నటి ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాసేపు షాక్‌కు గురైన ఆమె వెంటనే తేరుకుని చిరునవ్వుతో అక్కడి నుంచి ముందుకు సాగారు. ఘటన మొత్తం క్షణాల్లోనే జరిగిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అభిమానంతో చేసిన చర్యగా కొందరు పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం అనుమతి లేకుండా సెలబ్రిటీలను తాకడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అభిమానులు తమ అభిమానాన్ని వ్యక్తం చేసేటప్పుడు సినీ తారల వ్యక్తిగత పరిధిని, గౌరవాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

కన్నడ చిత్రసీమలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న రచితా రామ్‌ ‘బుల్‌బుల్‌’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘సూపర్‌ మచ్చి’, తమిళంలో ‘కూలీ’ చిత్రాల్లోనూ కనిపించారు. ప్రస్తుతం చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తాజా సినీ వార్తలు పేర్కొంటున్నాయి.