జర్నలిస్టులపై తప్పుడు ఫిర్యాదులపై విచారణ జరపాలి

విద్యుత్‌ శాఖ ఏఈపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఏపీయూడబ్ల్యూజే నేతల వినతి

నరసరావుపేట, ఆంధ్రప్రభ: జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదులు చేసిన ఈపూరు మండల విద్యుత్‌ శాఖ ఏఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లిని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు.

సమాజంలో జరుగుతున్న అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగం, ప్రభుత్వ శాఖల్లో చోటుచేసుకునే అవినీతిని నిష్పాక్షికంగా వెలుగులోకి తీసుకురావడంలో పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఏపీయూడబ్ల్యూజే నాయకులు తెలిపారు. జర్నలిస్టులు తమ వృత్తి ధర్మంలో భాగంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, తప్పుడు ఫిర్యాదులు చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు.

వార్త ప్రచురించిన నేపథ్యంలో ఫిర్యాదు

ఈపూరు మండల విద్యుత్‌ శాఖ ఏఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవల ‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో ప్రచురితమైన వార్త నేపథ్యంలో ఆంధ్రప్రభ పల్నాడు జిల్లా బ్రాంచ్‌ మేనేజర్‌ శిఖాకొల్లి ఫణికుమార్‌, ఈపూరు మండల రిపోర్టర్‌ శ్రీనివాసరావులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆరోపణలతో ఫిర్యాదులు చేశారని నాయకులు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఎస్పీని కోరారు.

విద్యుత్‌ శాఖలో అవినీతికి సంబంధించిన అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడం జర్నలిస్టుల వృత్తిపరమైన బాధ్యత అని పేర్కొన్నారు. వార్తా కథనం ప్రచురించిన నేపథ్యంలో జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అధికారులు నిష్పాక్షికంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు విచారణలో నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

జర్నలిస్టులపై ఇటువంటి చర్యలు కొనసాగితే ప్రజా సమస్యలను స్వేచ్ఛగా వెలుగులోకి తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు వృత్తిపరమైన స్వేచ్ఛ, భద్రత కల్పించడంతో పాటు ప్రజాస్వామ్యంలో కీలకమైన పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని జిల్లా ఎస్పీని కోరారు.

కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు వార్త జగన్మోహన్‌రెడ్డి, ఐ న్యూస్‌ నాగరాజు, సాక్షి రమణారెడ్డి, జ్యోతి చంద్రశేఖర్‌, ఆంధ్రప్రభ జిలాని మాలిక్‌, భాష, అమరావతి వాయిస్‌ కోటేశ్వరచారి, మున్సిప్‌ టీవీ షాహిద్‌, ప్రసన్న, విశాలాంధ్ర సిద్ధు, వివిధ పత్రికల పాత్రికేయులు శ్రీనివాసరావు, వినోద్‌, శివ, బాలు, వసంత్‌ తదితరులు పాల్గొన్నారు.