టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఐకానిక్ కల్ట్ క్లాసిక్ ‘శివ’ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1989లో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు 4K డాల్బీ అట్మాస్ క్వాలిటీతో నవంబర్ 14న మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేయనుంది.
ఈ సందర్భంగా, సినిమా నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఒక ప్రత్యేకమైన పోటీని ప్రకటించింది. శివ సినిమాకు సంబంధించిన ట్రైలర్లు, పోస్టర్లు, వీడియో ఎడిట్స్, పోస్టర్ డిజైన్లు, కాన్సెప్ట్ ఆర్ట్‌వర్క్‌లను అభిమానులు తమ సొంత క్రియేటివిటీతో సృష్టించి ‘Shiva 4K Contest’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాలని తెలిపింది. ఈ పోస్ట్‌లలో అన్నపూర్ణ స్టూడియోస్‌ను ట్యాగ్ చేయడం తప్పనిసరి.
పోటీలో గెలిస్తే ఏం చేస్తారు?
ఈ పోటీలో గెలిచిన టాప్ త్రీ విజేతలకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. నాగార్జున, రామ్ గోపాల్ వర్మలను స్వయంగా కలుసుకునే ఛాన్స్ పొందుతారు. ఎంట్రీలను పంపడానికి అక్టోబర్ 20 వరకు గడువు ఉంది.