ఆమ్నియల్ ఫార్మాస్యూటికల్స్‌లో కార్యదర్శి పర్యటన
ఔషధ తయారీ, బయోఫార్మాస్యూటికల్ ఆవిష్కరణలపై చర్చ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారత ప్రభుత్వ ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి అహ్మదాబాద్‌లోని ఆమ్నియల్ ఫార్మాస్యూటికల్స్ కార్పొరేట్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. కంపెనీ వృద్ధి, పెట్టుబడులు, భవిష్యత్ ప్రణాళికలు, విస్తరిస్తున్న సామర్థ్యాలపై ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. ఔషధ తయారీ, ఆవిష్కరణల్లో ఆమ్నియల్ చేస్తున్న కృషితో పాటు కాశివ్ బయోసైన్సెస్ కొనుగోలు అనంతరం విస్తరించిన బయోసిమిలార్స్ సామర్థ్యాలపై చర్చ జరిగింది. ఆర్‌అండ్‌డీ, అధునాతన తయారీ, కాంప్లెక్స్ జెనరిక్స్, ఇంజెక్టబుల్స్, పెప్టైడ్స్, ఏపీఐల రంగాల్లో కంపెనీ పెట్టుబడులు, సామర్థ్యాలను ప్రతినిధులు వివరించారు.
కాశివ్ బయోసైన్సెస్ స్వాధీనంతో పరిశోధన, అభివృద్ధి, తయారీ, వాణిజ్యీకరణను అనుసంధానించే సమీకృత బయోసిమిలార్స్ వేదిక ఏర్పడిందని కంపెనీ తెలిపింది. ఈ కలయికతో బయోసిమిలార్స్ ప్రణాళికలను విస్తరిస్తూ దీర్ఘకాలిక వృద్ధికి సంస్థను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది.
భారతదేశ ఔషధ తయారీ సామర్థ్యాల పెంపు, బయోఫార్మాస్యూటికల్ ఆవిష్కరణలు, అధునాతన మౌలిక సదుపాయాలు, పరిశ్రమ–విద్యాసంస్థల సహకారం, నైపుణ్యాభివృద్ధి, నియంత్రణ విధానాలపై సమావేశంలో చర్చించారు. బయోఫార్మాస్యూటికల్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం–పరిశ్రమల నిరంతర సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఆమ్నియల్ ఆర్‌అండ్‌డీ హెడ్ డాక్టర్ పార్వ పురోహిత్ మాట్లాడుతూ భారతదేశానికి ఔషధ తయారీలో బలమైన పునాది ఉందని, బయోఫార్మాస్యూటికల్ ఆవిష్కరణల్లో మరింత వృద్ధి అవకాశాలున్నాయని తెలిపారు. హ్యూమన్ రిసోర్సెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ మైత్రా మాట్లాడుతూ పరిశ్రమకు సిద్ధమైన నైపుణ్య శ్రామిక శక్తిని అందించేందుకు పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
