Amit Shah | రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. ముఖ్యమైన అంశాలపై సభలో చర్చించకుండా నిరసనలు, వాకౌట్లకు దిగుతోందని మండిపడ్డారు. పార్లమెంటే ప్రజాస్వామ్యంలో చర్చలకు అత్యంత ముఖ్యమైన వేదిక అని, అక్కడే సమస్యలపై చర్చించి పరిష్కారాలు కనుగొనాలని అన్నారు.
హరియాణాలోని కర్నాల్‌లో బీజేపీ నిర్వహించిన ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అంతం చేయండి’ పాదయాత్రలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తీరును తప్పుబట్టారు. పార్లమెంటులో చర్చలకు బదులుగా బయట నిరసనలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు.
2024 ఎన్నికల్లో దేశ ప్రజలు ప్రధాని మోదీకి వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టే అవకాశం ఇచ్చారని అమిత్ షా గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓటముల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మార్చుకోవడం లేదని విమర్శించారు. 2024 నుంచి రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పలుమార్లు రాజకీయంగా ఓటమిని ఎదుర్కొందని అన్నారు. పార్లమెంటు కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించడం, కీలక అంశాలపై చర్చలకు దూరంగా ఉండటం ఆ పార్టీ విధానంగా మారిందని ఆరోపించారు.
పార్లమెంటులో చర్చలకు ఎందుకు దూరం?
ప్రజాస్వామ్యంలో పార్లమెంటు చర్చలకు అత్యున్నత వేదిక అని అమిత్ షా పేర్కొన్నారు. అలాంటి సభలో చర్చలు జరగకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ సభలో ముఖ్యమైన అంశాలపై చర్చించకుండా గందరగోళం సృష్టిస్తున్నారని, వాకౌట్లు, నిరసనలను కాంగ్రెస్ పార్టీ రాజకీయ పద్ధతిగా మార్చుకుందని విమర్శించారు. పార్లమెంటులో చర్చించాల్సిన విషయాలను వీధుల్లోకి తీసుకెళ్లి ఆందోళనలు చేయడం ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
అన్ని స్థాయిల్లో బీజేపీ సిద్ధంగా ఉంది
ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ తక్కువగా అంచనా వేయకూడదని అమిత్ షా అన్నారు. పార్లమెంటు నుంచి అసెంబ్లీల వరకు, గ్రామాలు, పొలాల వరకు ప్రతి చోటా బీజేపీ కాంగ్రెస్‌ను ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లి రాజకీయ పోరాటం చేయాలనుకున్నా బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని అన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అంతం చేయండి’ పేరుతో నిర్వహించిన ఈ పాదయాత్ర రాహుల్ గాంధీకి గట్టి సమాధానమని అమిత్ షా వ్యాఖ్యానించారు.
