bjpvscongress| రాహుల్‌కు అమిత్ షా సవాల్!
రాహుల్‌కు అమిత్ షా సవాల్!
- ఆరోపణల్లో నిజం, విషయం, తర్కం ఉంటే సభకు రావాలి: అమిత్ షా
- సభలో సమాధానాలు వినకుండా వాకౌట్లు చేస్తున్నారంటూ రాహుల్‌పై విమర్శలు
- రోడ్లపై నిరసనలు చేపడితే అక్కడా బీజేపీ కార్యకర్తలు ఉంటారని హెచ్చరిక
- మోదీకి రాహుల్ బహిరంగ చర్చ సవాల్ చేసిన మరుసటి రోజే షా కౌంటర్
హరియాణా, ఆంధ్రప్రభ : పార్లమెంట్ వేదికగా తనతో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాల్ విసిరారు. ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణల్లో నిజం, విషయం, తర్కం ఉంటే వాటిని పార్లమెంట్‌లోనే ప్రస్తావించాలని సూచించారు. సభ వెలుపల నిరసనలు చేపట్టడం కంటే చర్చకు రావాలని అన్నారు.
హరియాణాలోని కర్నాల్‌లో గురువారం బీజేపీ నిర్వహించిన ‘లోకతంత్ర బచావో.. అరాచకతా హటావో’ ప్రచార ముగింపు సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌ను సజావుగా సాగనివ్వడం లేదని, సభలో చర్చలకు బదులుగా అంతరాయాలు, వాకౌట్లు చేస్తున్నారని విమర్శించారు. సభలో చర్చించకుండా బయట ఆందోళనలతో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ తీరుపై విమర్శలు
ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ చర్చలకు అత్యున్నత వేదిక అని అమిత్ షా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ బాధ్యతాయుతమైన చర్చకు సిద్ధమైతే తన ఆరోపణలను సభలో ప్రస్తావించాలని అన్నారు. వాటికి ప్రభుత్వం సమాధానాలు ఇస్తుందని, ఆ సమాధానాలను ఎదుర్కోలేక రాహుల్ చర్చ నుంచి తప్పుకుంటారని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లోనే కాకుండా శాసనసభల్లో, గ్రామాల్లో, పొలాల్లో, రోడ్లపైనా కాంగ్రెస్ రాజకీయ ప్రచారానికి బీజేపీ సమాధానం చెబుతుందని హెచ్చరించారు. ప్రజలను సమీకరించి నిరసనలు చేపడితే బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడే ఉంటారని అన్నారు.
రాహుల్ సవాల్‌కు అమిత్ షా కౌంటర్
ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీ సవాల్ విసిరిన నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్), ఓట్ల అక్రమాల ఆరోపణలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా షా ప్రకటించారు. ఈ అంశంపై చర్చకు రావాలని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు. మరోవైపు, పార్లమెంట్‌లోనే చర్చ జరగాలన్న అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
బీజేపీ ప్రచారానికి ముగింపు
అక్టోబర్ 22న ప్రారంభమైన బీజేపీ ‘లోకతంత్ర బచావో.. అరాచకతా హటావో’ ప్రచార తొలి విడత నవంబర్ 5న కర్నాల్ సభతో ముగిసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, బీజేపీ నేత స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు. ప్రచార రెండో విడత నవంబర్ 11 నుంచి 30 వరకు కొనసాగనుంది.
