America | షట్ డౌన్ ముగిసింది..
America | వాషింగ్టన్ : అమెరికా చరిత్రలో సుధీర్ఘ కాలం కొనసాగిన ఆర్థిక షట్ డౌన్ ముగిసింది. షట్ డౌన్ ను ముగించే ప్రభత్వ ఫండింగ్ బిల్లులకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో 43 రోజుల సుదీర్ఘ షట్ డౌన్ కు అధికారికంగా ముగింపు లభించింది. అంతకు ముందు ప్రతినిధుల సభలో 222-209 ఓట్ల తేడాతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఇప్పటికే సెనెట్ దీన్ని ఆమోదించింది. బిల్లు పై సంతకం చేయడానికి ముందు ట్రంప్ మాట్లాడుతూ మన దేశం ఎన్నటికీ దోపిడీకి లొంగబోదనే స్పషమైన సందేశాన్ని ప్రపంచానికి పంపిస్తున్నామని చెప్పారు.
డెమోక్రాట్ల చర్యల కారణంగా అమెరికా (America) కొంతకాలంగా విపత్తు పరిస్థితులు ఎదుర్కొందని చెప్పారు. షట్ డౌన్ ప్రారంభమైన తర్వాత నుంచి ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులను ఈ బిల్లు రద్దు చేసింది. షట్ డౌన్ మూలంగా ఆర్ధికంగా అనేక సమస్యలను ఉద్యోగులు, సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఎదుర్కొన్నాయి. డెమోక్రాట్ల పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ అనేక ప్రాజెక్టులను రద్దు చేశారు. అనేక మంది ఉద్యోగులను ఈ పేరుతో తొలగించారు. తాజాగా బిల్లును ఆమోదించడంతో ఈ నిర్ణయాల్నింటినీ రద్దు చేస్తారు. దేశ ప్రజలకు పార్లమెంట్ లో డెమెక్రాట్లకు రిపబ్లికన్ లకు మధ్య ప్రతిష్టంభన షట్ డౌన్ కి దారి తీసింది. అక్టోబర్ 1న ప్రారంభమైన షట్ డౌన్ సుదీర్ఘంగా 43 రోజుల పాటు కొనసాగింది.
ఇంతకాలం ప్రభుత్వ సేవలు నిలిచిపోవడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. అంతకు ముందు 2018 – 2019లో 35 రోజుల పాటు షట్ డౌన్ కొనసాగింది. డెమోక్రాట్లు సృష్టించిన ఈ పరిస్థితిని అమెరికన్లు మరచిపోవద్దని వచ్చే సంవత్సరం జరిగే మధ్యంతర ఎన్నికల్లో వారికి మద్దతు ఇవ్వద్దని ప్రజలను ట్రంప్ (Trump) కోరారు. బిల్లు పాసైన వెంటనే ఫండింగ్ పై సంతకాలు చేసే కార్యక్రమాన్ని ట్రంప్ చేపట్టారు.

