మానవత్వం చాటుకున్న పూర్వ విద్యార్థులు
- స్నేహితుడి కుటుంబానికి రూ. 30 వేల ఆర్థిక సాయం
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి ఎస్ఎస్సీ 2000 మిలీనియం బ్యాచ్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన గిర్ధవారి వెంకటరమణ తల్లి గంగుబాయి అనారోగ్యంతో గత వారం మృతి చెందారు.
నిరుపేద కుటుంబానికి చెందిన తమ మిత్రుడికి ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించిన బ్యాచ్ సభ్యులు.. శనివారం వెంకటరమణ ఇంటికి వెళ్లి రూ.30 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కష్టకాలంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బ్యాచ్ సభ్యులను పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జన్నారపు శంకర్, వేల్పుల నవీన్, సట్ల శశిధర్, లక్ష్మణ్, నరేష్, సబ్బని రాజశేఖర్, బత్నాస్ శేఖర్, జోగు రాజేశ్వర్, దూడ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
