కూటమి ఐక్యతే రాష్ట్ర ప్రగతికి బలం

  • చంద్రబాబు అనుభవం.. పవన్‌ ప్రజాబలం ఏపీ అభివృద్ధికి పునాది
  • కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురామ్‌
  • అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా రాష్ట్రం
  • కూటమి ప్రభుత్వం మరింత వేగంగా పనిచేయాలి
  • ఏపీని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
  • పవన్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలి

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి ఐక్యతే ఆంధ్రప్రదేశ్‌ ప్రగతికి బలమని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ నెట్టెం శ్రీ రఘురామ్‌ అన్నారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామంలో నెట్టెం రఘురామ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ (తాతయ్య)తో కలిసి కేక్‌ కట్‌ చేసి పవన్‌ కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు,పవన్‌ నాయకత్వంతో అభివృద్ధి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా ముందుకు సాగుతోందని నెట్టెం రఘురామ్‌ అన్నారు. చంద్రబాబు అనుభవం, పరిపాలనా దక్షతకు పవన్‌ ప్రజాబలం, యువతలో ఉన్న విశ్వాసం తోడవడంతో రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడిందని పేర్కొన్నారు.

కూటమి ఐక్యతే రాష్ట్రానికి బలం..

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాలని నెట్టెం శ్రీ రఘురాం అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం మరింత వేగంగా పనిచేసి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. యువతలో పవన్‌ కళ్యాణ్‌పై ఉన్న విశ్వాసం రాష్ట్ర భవిష్యత్తుకు సానుకూల శక్తిగా నిలుస్తోందని రఘురామ్‌ పేర్కొన్నారు. ప్రజా సేవ, రాష్ట్ర అభివృద్ధిలో పవన్‌ మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. పవన్‌ కళ్యాణ్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగించాలని నెట్టెం రఘురామ్‌ హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. వేడుకల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు.