ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం.. చైర్మన్ శ్రీధర్ వర్మ
తిరుపతి సిటీ, ఆంధ్రప్రభ : స్థానిక బైరాగిపట్టెడలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా దాదాపు రూ.3 వేల కోట్ల మేర పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. మంచానికి పరిమితమైన దివ్యాంగుల పింఛన్‌ను రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు.
పింఛన్లను పెంచి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.4 వేల పింఛన్‌ను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నామని చెప్పారు.
పింఛన్ పంపిణీ సమయంలో లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పేదలకు పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
