తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కారు అండ!
- సినీ మౌలిక వసతులకు భూములిస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- సింగిల్ విండోతో ఉచితంగా షూటింగ్ అనుమతులు
- ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ
- విజయవాడలో తరచూ సినీ వేడుకలు నిర్వహించాలి
విజయవాడ, ఆంధ్రప్రభ: తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కళలను, కళాకారులను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో విబి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో ‘సేవ్ ఆర్టిస్ట్–సేవ్ టాలెంట్’ నినాదంతో నిర్వహించిన ‘వెండితెర–ఓటీటీ అవార్డ్స్ 2025–26’ వేడుకకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు.
విజయవాడకు సినీ అనుబంధం..
విజయవాడ తొలి నుంచీ సాంస్కృతిక, సినీ రంగాలకు అనుకూల ప్రాంతమని మంత్రి అన్నారు. నగరం నుంచి ఎందరో నటులు, సాంకేతిక నిపుణులు చిత్ర పరిశ్రమలోకి వెళ్లి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు ఉచితంగా, సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన సహజ, చారిత్రక లొకేషన్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో డబ్బింగ్, రికార్డింగ్, రీ-రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు నిర్మాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ నిర్మాతలతో ఈ అంశంపై చర్చలు జరిపినట్లు తెలిపారు. సినీ మౌలిక వసతుల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి భూముల కేటాయింపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో సినీ పరిశ్రమను మరింత విస్తరింపజేస్తామని కందుల దుర్గేష్ తెలిపారు. పరిశ్రమకు అవసరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
విజయవాడలో సినీ వేడుకలు..
హైదరాబాద్ తరహాలో విజయవాడలోనూ తరచూ సినీ కార్యక్రమాలు, అవార్డు వేడుకలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ‘వెండితెర–ఓటీటీ అవార్డ్స్’ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది విజయవంతంగా కొనసాగించాలని నిర్వాహకులను కోరారు. సినీ ప్రముఖులు మంత్రి కందుల దుర్గేష్ చొరవను అభినందించారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వస్తున్నాయని పేర్కొన్నారు. మన సంస్కృతిని పరిరక్షిస్తూ యువ కళాకారుల ప్రతిభకు వేదిక కల్పించడమే అవార్డుల కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని విబి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్వాహకులు తెలిపారు.
‘ఉత్తరం’ పాట ఆవిష్కరణ..
కార్యక్రమంలో రామకృష్ణ నిర్మాతగా, శరత్ దర్శకత్వంలో విక్రమ్, శ్రీ గాయత్రి నటీనటులుగా తెరకెక్కుతున్న పల్లెటూరి ప్రేమకథా చిత్రం ‘ఉత్తరం’లోని పాటను ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు మహిమదన్ స్వరపరిచిన పాటను మంత్రి అభినందించి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సభ్యుడు కే.ఎస్. రామారావు, ప్రముఖ హీరో వడ్డే నవీన్, సంగీత దర్శకులు రఘు కుంచె, సినీ నటులు దివ్యవాణి, అనిత, రాజీవ్ కనకాల, సమీర భరద్వాజ్, ఆట సందీప్, జ్యోతి, ‘బింబిసార’ ఫేమ్ బేబీ శ్రీదేవి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ, నిర్వాహకులు విష్ణు బొప్పన, రవికుమార్, అనిత తదితరులు పాల్గొన్నారు.

