ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరునికి స్వేచ్ఛ, హక్కులుంటాయని, అన్ని కులాలు, మతాలు ఒక్కటేనని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఇవాళ భూపాలపల్లి పట్టణ కేంద్రంలో 36 క్రైస్తవ సంఘాలు ఏకమై బాంబుల గడ్డ నుండి శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిధిగా హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరునికి స్వేచ్ఛ, హక్కులుంటాయని చెప్పారు. కులాలు, మతాలు భేదం లేకుండా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు తమకు కమ్యూనిటీ భవనం కావాలని కోరగా, వారికి కమ్యూనిటీ భవనం మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.