హైదరాబాద్ – దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు, విశాఖపట్నం స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే వారికి రైల్వేశాఖ అలర్ట్ జారీ చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలోకి వచ్చే కడియం, ద్వారపూడి, అనపర్తి రైల్వే స్టేషన్ల మధ్య నాన్-ఇంటర్ లాకింగ్ పనులు కారణంగా ఈ స్టేషన్ల పరిధిలో నడిచే సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గుంటూరులో బయలుదేరి విశాఖకు వెళ్లే సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17239ని ఇవాళ, రేపు రద్దు చేశారు. అలాగే విశాఖలో బయలుదేరి గుంటూరుకు వెళ్లే సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17240ని రేపు, ఎల్లుండి రద్దు చేశారు. దీంతో ఈ రెండు స్టేషన్లతో పాటు మధ్యలో ఉన్న స్టేషన్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పును గమనించాల్సి ఉంటుంది. వీటికి ప్రస్తుతం బుకింగ్స్ కూడ తాత్కాలికంగా నిలిపేశారు. వీటి వల్ల సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మార్చి 1 నుంచి మార్చి 3 వరకూ జరిగే ఈ పనుల కారణంగా సింహాద్రి ఎక్స్ ప్రెస్ తో పాటు ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేస్తున్నారు.
నెల రోజుల పాటు కాచిగూడ-నిజామాబాద్
కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602)డెమూ రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు దాకా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్‌లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.