ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం
*ఫ్యాక్టరీ వ్యర్థాల నిర్వహణ, నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు
*పశుగ్రాసం కొరత లేకుండా ముందస్తు ప్రణాళిక
*నైపుణ్యం, పి4 వ్యవసాయంపై సూచనలు
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో మండలంలో తలెత్తే నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత వంటి సమస్యలను ముందుగానే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని శ్రీ సత్యసాయి జిల్లా డీజీపీవో, గోరంట్ల మండల ప్రత్యేక అధికారి శ్రీమతి వై. సమత ఆదేశించారు. బుధవారం గోరంట్ల మండల కేంద్రంలో మండల స్థాయి అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యంగా పరిశ్రమలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను ఇష్టానుసారంగా పడవేయకుండా, పర్యావరణానికి హాని కలగకుండా నిబంధనల మేరకు వాటిని సక్రమంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వ్యర్థాల వల్ల ప్రజారోగ్యానికి, వ్యవసాయ భూములకు, నీటి వనరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు, భూగర్భ జలాలపై ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమత సూచించారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను గుర్తించి వాటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
అదేవిధంగా పశువులకు అవసరమైన పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మండలంలోని పశుగ్రాస లభ్యత, అవసరాలను అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టాలని, రైతులు, పశుపోషకులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
నైపుణ్యం అప్లికేషన్ నిర్వహణపై కూడా సమీక్షించిన ప్రత్యేక అధికారి, సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అర్హులైన వారికి నైపుణ్యాభివృద్ధి అవకాశాలు అందేలా చూడాలని సూచించారు. యువతకు ఉపాధి, శిక్షణ అవకాశాలను అనుసంధానం చేయడంలో సిబ్బంది చురుగ్గా వ్యవహరించాలన్నారు.
పి4 వ్యవసాయానికి సంబంధించిన అంశాలపైనా అధికారులతో చర్చించారు. రైతులకు అవసరమైన సమాచారం, ప్రభుత్వ కార్యక్రమాలు, వ్యవసాయ సంబంధిత సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజలకు సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యం లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సమత స్పష్టం చేశారు. సమావేశంలో మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
