Albania-Flamingo-Revolution : ఫ్లెమింగో విప్ల‌వ జ్వాల‌..! Andhra Prabha Top News

Albania-Flamingo-Revolution : ఫ్లెమింగో విప్ల‌వ జ్వాల‌..! Andhra Prabha Top News

  • అల్బేనియాలో హైటెన్ష‌న్
  • విద్యార్థుల తిరుగుబాటు..!
  • రణరంగంగా రాజధాని
  • విద్యాశాఖ పై రాళ్ల దాడి
  • వాటర్‌ క్యానన్లతో పోలీసుల ప్రతిఘటన
  • ప్రధాని రాజీనామాకు డిమాండ్
  • అవినీతి ఆరోపణలతో ముదిరిన ఉద్యమం

(తిరానా, ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి )

విద్యార్థుల ఆందోళనతో అల్బేనియా రాజధాని తిరానా అట్టుడుకుతోంది. విశ్వవిద్యాలయాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని, యువతకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని, ప్రధాని ఎడి రామా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. బుధవారం వందలాది మంది విద్యార్థులు విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఎదుట ఆందోళనకు దిగారు. కొందరు నిరసనకారులు భవనం వైపు రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతోపాటు వాటర్‌ క్యానన్లను వినియోగించారు. సమీపంలోని కంచెలను తొలగించి రహదారిపై అడ్డుగా పెట్టిన నిరసనకారులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తిరానాలో తీవ్ర స్థాయిలో ప్రారంభమైన నిరసనలు బుధవారం కూడా కొనసాగాయి. విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఎదుట వందలాది మంది గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులు మెరుగుపరచడం, ఫీజుల భారం తగ్గించడం, యువతకు ప్రభుత్వ మద్దతు పెంచడం వంటి డిమాండ్లతో విద్యార్థులు ఉద్యమిస్తున్నారు.

హింసకు దూరంగా ఉండండి

నిరసనలపై అల్బేనియా ఉప ప్రధాని అల్బానా కొచియు స్పందించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు చట్టబద్ధమైనదేనని, అయితే దాని పేరుతో హింసకు పాల్పడటం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం, రహదారులపై ఘర్షణలకు దిగడం సమర్థనీయం కాదని ఆమె ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. నిరసన హక్కును విశ్వసించే విద్యార్థులు, పౌరులు హింసకు, విధ్వంసానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు, తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు.

‘ఫ్లెమింగో విప్లవం’తో మొదలు

అల్బేనియాలో సాగుతున్న ప్రస్తుత ఆందోళనలకు వెనుక కొన్ని నెలలుగా పేరుకుపోతున్న అసంతృప్తి ఉందని బాల్కన్‌ ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టింగ్‌ నెట్‌వర్క్‌ అల్బేనియా ఎడిటర్‌ బెసర్‌ లిక్మెటా వెల్లడించారు. రాజధానిలోని ప్రధాన వీధుల్లో నాలుగు నెలలుగా ప్రతిరోజూ నిరసనలు జరుగుతున్నాయని, ఈ ఉద్యమానికి ‘ఫ్లెమింగో విప్లవం’ అనే పేరు ప్రచారంలో ఉందని అల్‌జజీరాకు తెలిపారు.దక్షిణ అల్బేనియాలోని పర్యావరణ పరిరక్షిత ప్రాంతంలో ఓ రిసార్ట్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్‌తో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్న ఈ ప్రాజెక్టుపై స్థానికంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని, నిర్ణయాల ప్రక్రియలో పారదర్శకత లేదని నిరసనకారులు ఆరోపించారు. ఈ క్రమంలో ప్రధాని రామా రాజీనామా చేయాలన్న డిమాండ్‌ ముందుకొచ్చింది.

యువతలో తీవ్ర‌ అసంతృప్తి

కాలక్రమంలో ఈ ఉద్యమం ఒక ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సాగిన నిరసన నుంచి విస్తృతమైన సామాజిక, రాజకీయ డిమాండ్లుగా మారిందని లిక్మెటా వివరించారు. అవినీతిని అరికట్టడం, యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించడం, అవకాశాల కొరతను తొలగించడం వంటి అంశాలు ఉద్యమంలో ప్రధానంగా మారాయని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో సదుపాయాల లేమి, అధిక ఫీజులు, యువతకు తగిన సహకారం అందకపోవడం తమ ఆందోళనలకు ప్రధాన కారణాలని విద్యార్థులు స్థానిక మీడియాకు తెలిపారు. ఉపాధి, విద్య, పారదర్శక పాలనపై యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ఈ నిరసనలు ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి.ఒక రిసార్ట్‌ ప్రాజెక్టుపై మొదలైన వ్యతిరేకత ఇప్పుడు విద్యా సంస్కరణలు, అవినీతి నిరోధం, యువత భవిష్యత్తు వంటి విస్తృత అంశాలకు విస్తరించింది. ఆందోళనలను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? విద్యార్థుల డిమాండ్లపై స్పందిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.