అలగనూరు రిజర్వాయర్‌పై బహిరంగ చర్చకు రండి
దారా సుధీర్‌కు టీడీపీ నేతల సవాల్..
రూ.3.61 కోట్ల పనిని రూ.36 కోట్లకు తీసుకెళ్లిందెవరు?
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : అలగనూరు రిజర్వాయర్, నందికొట్కూరు తాగునీటి సమస్యలపై అవగాహన లేకుండా వైసీపీ నేత డా. దారా సుధీర్ మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమని, దమ్ముంటే పటేల్ సెంటర్‌కు రావాలని సవాల్ విసిరారు. గురువారం నందికొట్కూరులోని టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. అలగనూరు రిజర్వాయర్ వివాదం తొలుత చేపల పంచాయతీతోనే ప్రారంభమైందన్నారు. కమిషన్ ఇవ్వలేదనే కారణంతో చేపలు పట్టకుండా మత్స్యకారులను అడ్డుకున్నది వైసీపీ నాయకులేనని ఆరోపించారు. రిజర్వాయర్‌లో 500 మీటర్ల బండ్ కూలిపోవడం గత వైసీపీ హయాంలోనే జరిగిందన్నారు. అప్పటి నాయకుడు రివర్స్ టెండరింగ్ పేరుతో టెండర్ వేసి పనులు పూర్తి చేయలేక మధ్యలోనే చేతులెత్తేశారని విమర్శించారు. రూ.3.61 కోట్లతో పూర్తయ్యే పనిని రూ.36 కోట్లకు తీసుకెళ్లారని, ఇదేనా రివర్స్ టెండరింగ్ విధానం అని ప్రశ్నించారు.
2021లో జీవో నంబర్ 70 ద్వారా రూ.3.61 కోట్ల పనులకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పనులు పూర్తి చేయలేకపోయారని తెలిపారు. చివరకు జీవో నంబర్ 687 ద్వారా కాంట్రాక్టర్‌తో పాటు వైసీపీ ప్రభుత్వమే పనులను క్లోజ్ చేసిందని, దీనికి సంబంధించిన ఆధారాలను బయటపెడతామని అన్నారు. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి అమృత్ పథకం కింద నందికొట్కూరు పట్టణ తాగునీటి అవసరాల కోసం అలగనూరు నుంచి నీటిని తరలించేందుకు రూ.109 కోట్లు మంజూరు చేయించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆ పనులను రద్దు చేసి, అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను సైతం ధ్వంసం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వాటిని నందికొట్కూరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
ఫ్యాక్షన్ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, గత వైసీపీ హయాంలోనే నందికొట్కూరులో ఫ్యాక్షన్ పెరిగిందని టీడీపీ నేతలు విమర్శించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, మాండ్ర శివానందరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. గతంలో బ్రహ్మంగారిమఠం వద్ద జరిగిన ఘటనలో తమ నాయకుడిపై 307 కేసు నమోదైతే తొమ్మిది నెలల పాటు నియోజకవర్గంలో కనిపించకుండా పోయారని గుర్తు చేశారు. డాక్టర్‌గా ఒక రోగాన్ని నిర్ధారించే ముందు ఎన్నో పరీక్షలు చేస్తారని, అలాగే మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని దారా సుధీర్‌కు హితవు పలికారు. దమ్ముంటే పటేల్ సెంటర్‌లో బహిరంగ చర్చకు రావాలని, ఆయన చెప్పిన చోట, చెప్పిన సమయంలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలు సవాల్ విసిరారు.
