విద్యారంగంలో ఆకుల రామసాయి వరుస విజయాలు

టీఎస్‌-సెట్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం
యూజీసీ-నెట్‌లో 99.44 పర్సంటైల్‌తో జేఆర్‌ఎఫ్‌ సాధన

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌ గ్రామానికి చెందిన ఆకుల రామసాయి విద్యారంగంలో వరుస విజయాలు సాధించారు. ఇటీవల నిర్వహించిన యూజీసీ-నెట్‌ జూన్‌ 2026 పరీక్షలో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ విభాగంలో 300 మార్కులకు 178 మార్కులు సాధించి, 99.44 పర్సంటైల్‌తో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత పొందారు. దేశవ్యాప్తంగా ఓబీసీ కేటగిరీ నుంచి జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన 37 మందిలో రామసాయి ఒకరిగా నిలిచారు.

2022లో నిర్వహించిన తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీఎస్‌-సెట్‌)లో 212 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సెట్‌లోనూ ఓపెన్‌ కేటగిరీలో అర్హత సాధించారు. కామారెడ్డిలోని తెలంగాణ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేసిన రామసాయి, పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అభ్యసించారు. ప్రస్తుతం అదే విశ్వవిద్యాలయంలో జేఆర్‌ఎఫ్‌ సాయంతో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆయన విజయాల పట్ల ఉప్లూర్‌ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.