విద్యార్థులు, సిబ్బంది ఇక్కట్లు : అక్బరుద్దీన్ ఒవైసీ

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీలో అక్బరుద్దీన్‌ ఆగ్రహం
బకాయిలతో లక్షలాది మంది విద్యార్థులు, వేలాది మంది కాలేజీ సిబ్బంది ఇబ్బందులు
జీతాలు చెల్లించలేక కాలేజీలు మూతపడుతున్నాయి.. కీలక ప్రశ్నను వాయిదా వేయడంపై అభ్యంతరం
‘రేపు ఉదయమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ జరపాలి’

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కారణంగా రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, వేలాది మంది కాలేజీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యాసంస్థల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన పేర్కొన్నారు. బకాయిల కారణంగా కొన్ని కాలేజీలు సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నాయని, ఫలితంగా కాలేజీలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సభ దృష్టికి తీసుకెళ్లారు.

‘నా ప్రశ్నను ఎందుకు వాయిదా వేశారు?’

తన ప్రశ్నకు సమాధానం పొందేందుకు అవకాశం ఇవ్వకుండా ఇతర ప్రశ్నలపై గంటల తరబడి చర్చ జరిపి, తన ముఖ్యమైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రశ్నను వాయిదా వేయడంపై అక్బరుద్దీన్‌ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు, విద్యాసంస్థలకు సంబంధించిన ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని కోరారు.

రేపే చర్చ జరపాలని డిమాండ్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశంపై రేపు ఉదయమే తన ప్రశ్నకు చర్చ చేపట్టాలని అక్బరుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. బకాయిల విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో పాటు విద్యార్థుల చదువులు, కాలేజీల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.