ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలు జయప్రదం చేయండి
సెప్టెంబరు 6 నుంచి కరీంనగర్‌లో మహాసభలు..
సంఘటిత, అసంఘటిత కార్మికులు పాల్గొనాలి: బోగే ఉపేందర్
ఉట్నూర్, ఆంధ్రప్రభ : కరీంనగర్‌లో సెప్టెంబరు 6, 7, 8 తేదీల్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ కోరారు. బుధవారం జైనూర్ ఆసుపత్రి ఆవరణలో కార్మికులతో కలిసి ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల గోడపత్రికలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యానికి ముందు 1920 అక్టోబరు 31న ఏఐటీయూసీ ఆవిర్భవించిందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి 44 కార్మిక చట్టాలను సాధించామని పేర్కొన్నారు. కరీంనగర్‌లో జరిగే రాష్ట్ర మహాసభల్లో జిల్లాలోని సంఘటిత, అసంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
వైద్యశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్, నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు అందించడంతో పాటు కార్మికుల ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ‘వ్యాపారం సులభతరం’ పేరుతో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక నియమావళిలుగా మార్చిందని బోగే ఉపేందర్ విమర్శించారు. కార్మిక వ్యతిరేక నాలుగు కార్మిక నియమావళిలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, పౌర సరఫరాల హమాలీ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఎస్‌పీఎంలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, పాత కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరారు.
జైనూర్ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర మహాసభలకు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్‌తో పాటు దేశ, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సంఘటిత, అసంఘటిత కార్మికులు మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు దత్తు, వైద్య కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జైనూర్ శాఖ అధ్యక్షుడు కె. దేవ్‌రావు, ఉపాధ్యక్షుడు శంకర్, లలిత, ప్రధాన కార్యదర్శి పుల్లారే మారుతి, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్, కోశాధికారి పరమేశ్వర్, నాయకులు దొందే రావు, మారుతి తదితరులు పాల్గొన్నారు.
