pollution| హ‌స్తిన‌లో విషవాయువులు!

హ‌స్తిన‌లో విషవాయువులు!

  • ఢిల్లీని కమ్మేసిన కాలుష్య భూతం..
  • 400కు చేరువలో ఏక్యూఐ!
  • దీపావళితో మరింత ముప్పు!
  • ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారిన పరిస్థితి
  • ఐదు రోజుల్లో 60 నుంచి 377కు పెరిగిన కాలుష్య సూచీ
  • 21 ప్రాంతాల్లో 400 దాటిన ఏక్యూఐ..
  • జహంగీర్‌పురి, ఐఐటీ ఢిల్లీలో 451 నమోదు
  • దీపావళి టపాసులతో మరింత ప్రమాదం..
  • వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం!

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి పండుగకు ముందే నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. స్వచ్ఛమైన గాలి కరువై ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బుధవారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 377కు చేరింది. ఇది ‘వెరీ పూర్‌’ (చాలా అధ్వాన్నం) కేటగిరీ కావడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఏక్యూఐ 400 దాటడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. నవంబర్‌ 6, 7 తేదీల్లో దీపావళి వేడుకల సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల కాలుష్యం తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఐదు రోజుల్లోనే పరిస్థితి తలకిందులు!
కొద్ది రోజుల క్రితం వరకు ఢిల్లీలో గాలి నాణ్యత కొంత మెరుగ్గా ఉంది. గత శుక్రవారం వర్షాలు, బలమైన గాలుల కారణంగా ఏక్యూఐ 60కి పడిపోయింది. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. అయితే ఆ ఊరట ఎంతోకాలం నిలవలేదు. క్రమంగా కాలుష్యం పెరుగుతూ వచ్చింది.

  • శుక్రవారం – 60
  • శనివారం – 117
  • ఆదివారం – 261
  • సోమవారం – 324
  • మంగళవారం – 350
  • బుధవారం – 377
    కేవలం ఐదు రోజుల్లోనే ఏక్యూఐ 60 నుంచి 377కు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నగరమంతా బూడిద రంగు పొగమంచు అలుముకోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

21 ప్రాంతాల్లో 400 దాటిన ఏక్యూఐ!
ఢిల్లీలోని 59 వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్లో 21 ప్రాంతాల్లో ఏక్యూఐ 400 మార్కును దాటింది. ఐఐటీ ఢిల్లీ, జహంగీర్‌పురి ప్రాంతాల్లో అత్యధికంగా 451 నమోదైంది. ఇక్కడ పరిస్థితి ‘సివియర్‌’ (తీవ్ర ప్రమాదకరం) స్థాయికి చేరింది. ఇక ఇగ్నో, మైదాన్‌గఢిలో అత్యల్పంగా 275 నమోదైంది. అయినప్పటికీ అక్కడి గాలి నాణ్యత కూడా ఆరోగ్యానికి అనుకూలంగా లేదు.

దగ్గు, కళ్ల మంట.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దగ్గు, గొంతు మంట, కళ్లలో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవారిపై కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.

దీపావళి టపాసులతో మరింత ముప్పు!
ప్రస్తుతం ఉన్న కాలుష్యానికి దీపావళి బాణాసంచా తోడైతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నవంబర్‌ 6, 7 తేదీల్లో టపాసులు కాల్చడం వల్ల ఏక్యూఐ ‘సివియర్‌’ స్థాయికి చేరవచ్చని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పండుగ తర్వాత కూడా దాదాపు వారం రోజుల పాటు కాలుష్య తీవ్రత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

పంట వ్యర్థాల దహనంతోనూ సమస్య
పంజాబ్‌లో పంట వ్యర్థాలను తగులబెట్టే ఘటనలు పెరగడం కూడా ఢిల్లీ కాలుష్యానికి ఒక కారణంగా మారుతోంది. పంట అవశేషాల దహనం వల్ల వెలువడే పొగ గాలిలో కలిసి రాజధాని ప్రాంతంలో కాలుష్య తీవ్రతను పెంచుతోంది. ఈ నేపథ్యంలో బయోమాస్‌ వినియోగాన్ని పెంచాలని విద్యుత్‌ కేంద్రాలకు ప్రభుత్వం సూచించింది. పంట వ్యర్థాలను తగులబెట్టకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించింది.

దీపావళి వేళ ప్రజలకు సవాల్‌!
ఒకవైపు పండుగ సందడి.. మరోవైపు విషపూరిత గాలి. ఈ రెండింటి మధ్య ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు, గాలుల కారణంగా కొద్దిరోజుల పాటు మెరుగుపడిన వాతావరణం మళ్లీ విషతుల్యంగా మారింది. దీపావళి తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కాలుష్య నియంత్రణ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయి? రాజధాని ప్రజలకు స్వచ్ఛమైన గాలి ఎప్పుడు అందుతుంది? అన్నది వేచి చూడాలి.