Air India | విదేశీ ట్రావెల్ కి నో టెన్ష‌న్ !!

  • విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియా ట్రావెల్‌ సిమ్‌
  • టాటా కమ్యూనికేషన్స్‌తో ఎయిర్‌ ఇండియా కొలాబ్..
  • 30 దేశాల్లో వాయిస్‌, డేటా సదుపాయాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విదేశీ ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ట్రావెల్‌ సిమ్‌ కార్డులను అందించనున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. అంతర్జాతీయ రోమింగ్‌ సేవలను అందించే ‘ఈజీరోమ్‌’ పేరుతో ఎయిర్‌ ఇండియా బ్రాండెడ్‌ ట్రావెల్‌ సిమ్‌ను టాటా కమ్యూనికేషన్స్‌తో కలిసి అభివృద్ధి చేసింది.

ఈ సిమ్‌ కార్డును భౌతిక సిమ్‌ రూపంలోనూ, ఈ-సిమ్‌ రూపంలోనూ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎయిర్‌ ఇండియా బ్రాండెడ్‌ వెబ్‌పేజీని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సిమ్‌ ద్వారా విదేశాల్లో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు వాయిస్‌, డేటా సేవలను వినియోగించుకోవచ్చు. దీంతో స్థానిక సిమ్‌ కార్డు కోసం వెతకాల్సిన అవసరం లేకుండా, విదేశీ ప్రయాణం ప్రారంభించే ముందే రోమింగ్‌ కనెక్టివిటీని సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రారంభ దశలో ట్రావెల్‌ సిమ్‌ను ఉచితంగా అందించనున్నట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. అయితే సిమ్‌ వినియోగించే సమయంలో అంతర్జాతీయ రోమింగ్‌ ప్యాక్‌లకు సంబంధించిన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవలు ఉత్తర అమెరికా, యూరప్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, ఆసియా-పసిఫిక్‌, మధ్యప్రాచ్య ప్రాంతాల్లోని 30 దేశాల్లో అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది.

ఎయిర్‌ ఇండియా, టాటా కమ్యూనికేషన్స్‌ రెండూ టాటా గ్రూప్‌లో భాగస్వామ్య సంస్థలే. విదేశీ ప్రయాణికులకు కనెక్టివిటీని సులభతరం చేయడంతో పాటు, ప్రయాణానికి సంబంధించిన అదనపు సేవలను ఒకే వేదిక ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఈ ట్రావెల్‌ సిమ్‌ సేవలను తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొంది. విదేశాల్లో ఎక్కువగా వాయిస్‌, డేటా సేవలను ఉపయోగించే ప్రయాణికులకు ఈ సౌకర్యం ఉపయోగపడే అవకాశం ఉంది.