అంతర్జాతీయ స్థాయిలో విద్యే లక్ష్యం..
- గడ్డిపల్లిలో ఇంటిగ్రేటెడ్ గురుకులం..
- గడ్డిపల్లిలో పనుల పరిశీలన
- పేద విద్యార్థులకు అత్యాధునిక వసతులు..
- అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందిస్తాం: భట్టి, ఉత్తమ్
గరిడేపల్లి, ఆంధ్రప్రభ : పేద వర్గాలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత గురుకుల పాఠశాల పనులను మంగళవారం రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సమృద్ధిగా నిధులు, వనరులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశిస్తే.. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగించినప్పటికీ గత ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం అందించలేకపోయిందని అన్నారు. తమ ప్రభుత్వం కోటి ఆరు లక్షల మంది లబ్ధిదారులకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని, వారికి పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు మునగాల మండలంలో అత్యాధునిక వంటశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గడ్డిపల్లిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అత్యాధునిక వసతులు కల్పించి, విద్యార్థులకు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అందిస్తామని తెలిపారు. పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలతో తనకు పేగుబంధం ఉందని, గత పార్లమెంట్ ఎన్నికల్లో లక్షకు పైగా మెజార్టీ అందించారని గుర్తుచేశారు. ప్రజల సహకారంతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల నేతృత్వంలో హుజూర్‌నగర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, తహసీల్దార్ స్రవంతి, ఎంఈవో శత్రునాయక్, హుజూర్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, నేరేడుచర్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ సందీప్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ మాశెట్టి నాగలక్ష్మి-శ్రీహరి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
