అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌

రూ.1400 కోట్ల కాంట్రాక్ట్‌పై అక్బరుద్దీన్‌ ప్రశ్నలు!
అండర్‌గ్రౌండ్‌ కేబులింగ్‌ పనులు ఒకే కంపెనీకే ఎలా? అంటూ అసెంబ్లీలో ప్రస్తావన
జీహెచ్‌ఎంసీ విభజన, ఉద్యోగుల కొరతపైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంఐఎం ఎమ్మెల్యే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు, కాంట్రాక్టుల కేటాయింపు, జీహెచ్‌ఎంసీ విభజన అంశాలపై అసెంబ్లీ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో రూ.1400 కోట్ల విలువైన అండర్‌గ్రౌండ్‌ కేబులింగ్‌ కాంట్రాక్ట్‌ ఒకే కంపెనీకి ఇవ్వడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. చిన్న కాంట్రాక్టర్లకు కూడా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఒకే కంపెనీకి భారీ కాంట్రాక్టులు ఎలా?

అసెంబ్లీలో మాట్లాడిన అక్బరుద్దీన్‌ ఒవైసీ.. హైదరాబాద్‌లో అండర్‌గ్రౌండ్‌ కేబులింగ్‌ కోసం ఇచ్చిన రూ.1400 కోట్ల కాంట్రాక్ట్‌ అంశాన్ని ప్రస్తావించారు. ఒకే కంపెనీకి వరుసగా పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు దక్కుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కంపెనీకి కాంట్రాక్టులు రావడం అదృష్టంగా మారిందని, అన్ని పనులు అదే సంస్థకు వెళ్తున్నాయని ఆరోపించారు. భారీ ప్రాజెక్టులను ఒకే సంస్థకు అప్పగించే బదులు చిన్న కాంట్రాక్టర్లకు కూడా పనులు విభజించి ఇస్తే వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అక్బరుద్దీన్‌ పేర్కొన్నారు.

బిల్లుల చెల్లింపులపై ప్రశ్నలు

ప్రజా సంక్షేమ పథకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతుల సమస్యల కోసం నిధుల కొరత ఉందని చెబుతున్న ప్రభుత్వం.. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో మాత్రం జాప్యం చేయడం లేదని అక్బరుద్దీన్‌ విమర్శించారు. సంబంధిత కంపెనీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని బిల్లులు చెల్లించారనే వివరాలను ఆర్టీఐ ద్వారా కోరినా పూర్తి సమాచారం అందలేదని ఆయన తెలిపారు.

జీహెచ్‌ఎంసీ విభజనపై సందేహాలు

జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించే నిర్ణయంపైనా అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నలు సంధించారు. విభజనకు అసలు కారణాలను ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీలోనే సిబ్బంది కొరత ఉందని, ఉద్యోగుల వేతనాలు, ఇతర సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే మూడు కార్పొరేషన్లకు అవసరమైన సిబ్బందిని ఎలా సమకూరుస్తారని ప్రశ్నించారు.

“కొత్త కార్పొరేషన్లకు ఉద్యోగులు ఎక్కడి నుంచి?”

జీహెచ్‌ఎంసీ విభజన తర్వాత పరిపాలనా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? కొత్త కార్పొరేషన్లకు ఎంత మంది ఉద్యోగులు అవసరం? వారికి నియామకాలు ఎలా చేపడతారు? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అక్బరుద్దీన్‌ కోరారు. నగర పాలన మరింత మెరుగుపడాలంటే కేవలం విభజన కాకుండా.. అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, నిధులపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలని సూచించారు.

అసెంబ్లీలో నగర అంశాలపై చర్చ

హైదరాబాద్‌ అభివృద్ధి, మౌలిక వసతులు, కాంట్రాక్టుల విధానం, జీహెచ్‌ఎంసీ పరిపాలన వంటి అంశాలు అసెంబ్లీలో చర్చకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్బరుద్దీన్‌ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.