Ai-Stocks-Crash : AI షేర్లు బేర్…! Andhra Prabha Top Story
Ai-Stocks-Crash : AI షేర్లు బేర్…! Andhra Prabha Top Story
- మార్కెట్లు గజగజ
- చిప్ కంపెనీలకు భారీ నష్టం
- తెరపైకి పెట్టుబడుల భయం
- దిగ్గజాల హెచ్చరిక ఫలితం
(వాషింగ్టన్: ఆంధ్రప్రభ ప్రతినిధి)
కృత్రిమ మేధ (AI).. ప్రపంచ మార్కెట్లను రికార్డు స్థాయికి తీసుకెళ్లిన టెక్నాలజీ. ఇప్పుడు అదే AI.. మార్కెట్లను కుదిపేస్తోంది. AI అభివృద్ధి వేగం, దాని వల్ల పొంచి ఉన్న ప్రమాదాలపై ఆ రంగంలోని దిగ్గజాలే తీవ్ర హెచ్చరికలు చేయడంతో సోమవారం ప్రపంచవ్యాప్తంగా AI అనుబంధ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. కోట్ల డాలర్ల పెట్టుబడులతో దూసుకెళ్తున్న ఈ రంగానికి సంబంధించి ఇప్పటివరకు వెలువడిన హెచ్చరికల్లో ఇదే అత్యంత తీవ్రమైనదిగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. AI సామర్థ్యాలను పెంచే పోటీ కొంతకాలం నెమ్మదిస్తే ఏమవుతుంది? అన్న ప్రశ్న ఇప్పుడు పెట్టుబడిదారులను వెంటాడుతోంది. ముఖ్యంగా AI డేటా సెంటర్లు, చిప్‌లు, విద్యుత్ సరఫరా, భారీ మౌలిక వసతుల కోసం కంపెనీలు తీసుకున్న రుణాలు, కుదుర్చుకున్న లీజులు, విద్యుత్ ఒప్పందాల పరిస్థితి ఏంటన్నది ఆందోళన కలిగిస్తోంది. AI నుంచి ఆశించిన ఆదాయం, కంప్యూటింగ్ డిమాండ్ తగ్గితే.. ఆ భారమంతా కంపెనీలపైనే మిగిలే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వేగం తగ్గించాలి ,, అమోడెయ్
AI రంగంలో ప్రముఖ సంస్థ ఆంథ్రపిక్ సీఈవో డారియో అమోడెయ్ ఈ ఆందోళనలకు మరింత బలం చేకూర్చారు. శనివారం ‘ఎక్స్’లో సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించిన ఆయన.. AI మోడళ్ల సామర్థ్యాలను పెంచే వేగాన్ని సంస్థలు తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధను దుర్వినియోగం చేసే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తత అవసరమని స్పష్టం చేశారు.
అమోడెయ్ వ్యాఖ్యలకు టెస్లా అధినేత, xAI వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ మద్దతు తెలిపారు. AI అభివృద్ధిలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయంలో వారు ఏకీభవించారు.
ఇదే సమయంలో ఆల్ట్‌మన్ మరో కీలక ప్రకటన చేశారు. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని ఓపెన్ఏఐ ఈ ఏడాది ఐపీఓకు వెళ్లే ఆలోచనలో లేదని తెలిపారు.
ఆరు నుంచి 12 నెలల్లోనే..’
అమోడెయ్ చేసిన హెచ్చరికల్లో అత్యంత కలవరపెట్టే అంశం ఇదే. రాబోయే ఆరు నుంచి 12 నెలల్లో AI ఏజెంట్లు మొత్తం ఇంటర్నెట్ను తమ ఆధీనంలోకి తీసుకునే స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే వందల బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. AI రంగం వేగంగా ఎదుగుతున్న కొద్దీ దాని దుర్వినియోగం కూడా పెద్ద సమస్యగా మారుతోందన్న ఆందోళన దీనితో మరింత పెరిగింది. ఇప్పటికే స్వయంప్రతిపత్తితో పనిచేసే AI ఏజెంట్ల సైబర్ దాడులు, భారీ డేటా సెంటర్ల నిర్మాణం వల్ల స్థానికంగా విద్యుత్, నీటి వినియోగంపై పెరుగుతున్న వ్యతిరేకత ఈ రంగంపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
ట్రంప్ మాత్రం ‘కూల్’!
AI ప్రమాదాలపై ఇంతటి హెచ్చరికలు వస్తున్నా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం వాటిని తేలిగ్గా తీసుకున్నారు. AIపై విమర్శలు చేస్తున్నవారిని ‘ప్రతికూల శక్తులు’గా అభివర్ణించారు. జరగని పరిణామాల గురించి భయపెట్టే కథనాలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో AI రంగంలో అమెరికా అగ్రస్థానాన్ని కొనసాగించాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా వెనుకబడితే చైనా ముందుకు దూసుకెళ్లే ప్రమాదం ఉందన్నదే ట్రంప్ వైఖరిలో ప్రధానాంశం. అంటే.. AI భద్రత కోసం వేగాన్ని తగ్గించాలా? లేక చైనాతో పోటీలో పైచేయి సాధించేందుకు మరింత వేగంగా ముందుకు వెళ్లాలా? అనే ప్రశ్న అమెరికా విధాన నిర్ణేతల ముందుంది.
షేర్లకు భారీ దెబ్బ
AIపై ఈ హెచ్చరికల ప్రభావం సోమవారం స్టాక్ మార్కెట్లలో స్పష్టంగా కనిపించింది. అమెరికా నాస్డాక్ ఈ-మినీ ఫ్యూచర్స్ దాదాపు 1.9 శాతం పడిపోయాయి. AI ఉత్సాహానికి ప్రధానంగా దోహదపడిన చిప్ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి మరింత తీవ్రంగా కనిపించింది. ఎన్విడియా షేరు సుమారు 3 శాతం క్షీణించింది. AMD ఏకంగా 5.7 శాతం నష్టపోయింది. మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సైతం 2.6 శాతం దిగజారింది. మెటా, అమెజాన్ వంటి భారీ క్లౌడ్ మౌలిక వసతుల కంపెనీల షేర్లు కూడా 1.4 శాతానికి పైగా పడిపోయాయి. యూరప్‌లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. టెక్నాలజీ షేర్ల సూచీ దాదాపు 2.5 శాతం కుప్పకూలింది. చిప్ తయారీ పరికరాల దిగ్గజం ASML షేరు 5.8 శాతం పతనమైంది. ఇన్ఫినియన్ 8.4 శాతం, సీమెన్స్ ఎనర్జీ 7.4 శాతం నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలోనూ AI భయం కనిపించింది. ఓపెన్ఏఐలో పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్‌బ్యాంక్ ఒక దశలో 13.2 శాతం వరకు పడిపోయింది. తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) 1.2 శాతం, దక్షిణ కొరియాకు చెందిన SK హైనిక్స్ 6.3 శాతం క్షీణించాయి.
అప్పులే అసలు భయం
AIపై హెచ్చరికలు కేవలం టెక్నాలజీ ప్రమాదాలకే పరిమితం కావడం లేదు. ఆర్థిక వ్యవస్థపైనా వాటి ప్రభావం ఉంటుందన్న భయం పెరుగుతోంది. AI సామర్థ్యాలను పెంచేందుకు కంపెనీలు భారీగా డేటా సెంటర్లు, చిప్ ఫ్యాక్టరీలు, విద్యుత్ మౌలిక వసతుల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇందుకోసం రుణాలు, దీర్ఘకాలిక లీజులు, భారీ విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి.ఒకవేళ AI పోటీ వేగం గణనీయంగా తగ్గితే.. ఈ మౌలిక వసతుల ఖర్చులను ఎవరు భరిస్తారన్నదే కీలక ప్రశ్న. పెట్టుబడులు తగ్గినా రుణాలు మాత్రం అలాగే ఉంటాయి. విద్యుత్ బిల్లులు, లీజులు, అప్పుల చెల్లింపులు కొనసాగుతాయి. దీంతో AI కథలోకి క్రెడిట్ రిస్క్ కూడా ప్రవేశించే అవకాశం ఉందని స్విస్కోట్ సీనియర్ విశ్లేషకురాలు ఐపెక్ ఓజ్కార్డెస్కాయా పేర్కొన్నారు.
అమెరికా–చైనా.. AI భద్రతా చర్చలు?
AI భద్రత విషయంలో అమెరికా, చైనా మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ నెలలో ఇరుదేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో AI భద్రత అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆంథ్రపిక్ సీఈవో అమోడెయ్ హెచ్చరికలను చైనా ప్రభుత్వ అనుకూల ‘గ్లోబల్ టైమ్స్’ తీవ్రంగా తప్పుబట్టింది. చైనా సాంకేతిక అభివృద్ధిని అడ్డుకునేందుకు రూపొందించిన ‘కొత్త ప్రచ్ఛన్న యుద్ధ వ్యూహం’గా ఆ వ్యాసాన్ని అభివర్ణించింది. దీంతో AI భద్రత అంశం కేవలం సాంకేతిక చర్చగా కాకుండా.. అమెరికా–చైనా వ్యూహాత్మక పోటీకి మరో వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘ఇదంతా హైప్’ అంటున్న బరీ
అయితే AI దిగ్గజాల హెచ్చరికలను అందరూ నమ్మడం లేదు. 2008 అమెరికా ఆర్థిక సంక్షోభానికి ముందు హౌసింగ్ మార్కెట్‌పై చేసిన పందాలతో ప్రసిద్ధి చెందిన పెట్టుబడిదారు మైఖేల్ బరీ.. అమోడెయ్, ఆల్ట్‌మన్ హెచ్చరికలను ‘హైప్, ప్రచారం’గా కొట్టిపారేశారు. AI వృద్ధి నిజంగా అదుపుతప్పే దశకు చేరిందా? లేక వృద్ధి మందగించే పరిస్థితిని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారా? అన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.
డాయిష్ బ్యాంక్ విశ్లేషకుల అంచనా మరోలా ఉంది. AIలో పెట్టుబడుల ఉత్సాహం సమీప భవిష్యత్తులోనే పూర్తిగా చల్లారిపోయే అవకాశాలు తక్కువని వారు పేర్కొన్నారు. కంపెనీలు, దేశాల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నందున.. ప్రత్యర్థులు ముందుకు వెళ్తున్న సమయంలో ఒక సంస్థ స్వచ్ఛందంగా వెనక్కి తగ్గడం కష్టమని అభిప్రాయపడ్డారు.
ఆంథ్రపిక్ వెనక్కి తగ్గడం లేదు!
ఇక్కడే మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. AI అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చిన ఆంథ్రపిక్.. తన వ్యాపార విస్తరణలో మాత్రం ముందుకు సాగుతోంది. ఆ సంస్థ వచ్చే నెలలో పబ్లిక్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఎన్విడియాను ప్రధాన పెట్టుబడిదారుగా తీసుకురావడానికి ఆంథ్రపిక్ చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ వర్గాలు వెల్లడించాయి. అంటే.. ఒకవైపు AI ప్రమాదాలపై హెచ్చరికలు.. మరోవైపు అదే రంగంలో పెట్టుబడులు, విస్తరణ కొనసాగింపు. ఇదే ఇప్పుడు మార్కెట్లలోని అసలు వైరుధ్యం. పెట్టుబడిదారులకు ‘అధిక అంచనాల’ భయం AI కంపెనీల విలువలు ప్రస్తుతం రెండు విషయాలపై భారీగా ఆధారపడి ఉన్నాయి భవిష్యత్తులో డిమాండ్ బలంగా కొనసాగుతుందన్న నమ్మకం, సాంకేతిక అభివృద్ధి వేగం ఎప్పటికీ తగ్గదన్న అంచనా. అందుకే ఈ అంచనాల్లో చిన్న మార్పు వచ్చినా పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించేందుకు పరుగులు తీసే అవకాశం ఉందని సాక్సో బ్యాంక్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ చారు చనానా పేర్కొన్నారు.ప్రస్తుతం AI కంపెనీలపై వచ్చిన హెచ్చరికలు తాత్కాలికంగా షేర్లపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. కానీ అసలు ప్రశ్న మరింత పెద్దది. AI విప్లవం నిజంగానే వేగం తగ్గించుకోబోతోందా? లేక.. భద్రతా హెచ్చరికలు, మార్కెట్ భయాలు, భారీ పెట్టుబడుల ఒత్తిడి అన్నింటినీ పక్కన పెట్టి అమెరికా–చైనా పోటీ మరింత వేగంగా ముందుకు సాగుతుందా?ప్రస్తుతానికి మార్కెట్లు మాత్రం ఒక సంకేతం ఇచ్చాయి.
