వ్యవసాయం బాగుంటుంది..
- పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
- రేగొండలో గాలికుంటు నివారణ టీకాలు
- గణప సముద్రంలో ఉచిత చేప పిల్లల విడుదల
భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : పశువులు బాగుంటేనే వ్యవసాయం, రైతులు బాగుంటారని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ , మత్స్యశాఖ, స్పోర్ట్స్, యూత్ సర్వీసెస్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Walkie-talkie Srihari) అన్నారు. ఈ రోజు భూపాలపల్లి జిల్లా లోని రేగొండ, గణపురం మండలాల్లో మంత్రి వాకిటి శ్రీహరి విస్తృతంగా పర్యటించారు.
ముందుగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి రేగొండలో జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత గాలి కుంటు నివారణ టీకాల కార్యక్రమంలో పాల్గొని పశువులకు గాలికుంటు నివారణ టీకాలు(vaccines) వేశారు. అనంతరం ఘనప సముద్రం చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100% సబ్సిడీతో అందజేసిన చేప పిల్లలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది మత్స్యశాఖ పై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం పాడిపరిశ్రమలు, మత్స్యశాఖ అభివృద్ధిని మరిచిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో 3 కోట్ల 26 లక్షల పశువులు(livestock) ఉన్నాయని, 54 లక్షల టీకాలు లక్ష్యం కాగా ఇప్పటికే 25 లక్షల టీకాలు వేయడం పూర్తయిందన్నారు. గాలికుంటు వ్యాధితో పశువుల్లో పాల, సంతాన ఉత్పత్తి తగ్గుతుందని, రానున్న రెండేళ్లలో గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
గత ప్రభుత్వం మత్స్యశాఖను పట్టించుకోలేదని, చెరువుల్లో చేపలు, రొయ్యలు పోయకున్నా పోసినట్లు రికార్డు చూపి నిధులు పక్కదారి పట్టించారన్నారు. ప్రజా ప్రభుత్వంలో రూ. 123 కోట్ల నిధులను ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీకి కేటాయించడం జరిగిందన్నారు. చిన్న కుటుంబాలను బాగు చేయడమే కాంగ్రెస్ సంకల్పం అన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ ఆర్ మంత్రిని సభాముఖంగా పలు అభివృద్ధి పనులకు నిధులు అడిగారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నియోజకవర్గానికి స్టేడియం, రెండు పశు వైద్య శాలలు మంజూరు చేశారు.
ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ సాయి కుమార్(Sai Kumar, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ లు శ్రీదేవి,కిష్టయ్య, జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆసోడ కుమారస్వామి, జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ్, రేగొండ పశువైద్యాధికారి మైథిలి, గణపసముద్రం మత్స్యశాఖ అధ్యక్షులు గుల్ల రాజు, గణపతి, కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

