బిక్కేరు వాగు సమీపంలో వ్యవసాయ మోటార్ల చోరీ
రూ.1.80 లక్షల విలువైన ఆరు మోటార్లు అపహరణ.. ఆరుగురు రైతులకు నష్టం
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని గుండాల రోడ్డులో బిక్కేరు వాగు ఆయకట్టుకు చెందిన ఆరుగురు రైతుల ఆరు వ్యవసాయ మోటార్లు సోమవారం రాత్రి చోరీకి గురయ్యాయి. మంగళవారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు మోటార్లు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. బిక్కేరు వంతెన సమీపంలో ఉన్న మూడు మోటార్లతో పాటు, కొంత దూరంలో ఉన్న మరో మూడు మోటార్లను గుర్తుతెలియని దుండగులు అపహరించారు.
ఈ చోరీలో బాధిత రైతులు బుర్ర లచ్చయ్య, ఆమనగంటి వెంకటరెడ్డి, బుర్ర రామచంద్రు, బోయిని లచ్చయ్య, దూదిమెట్ల బయ్యాలు, కల్వల యోగానందరావులకు చెందిన మోటార్లు అపహరణకు గురయ్యాయి. మొత్తం ఆరు మోటార్ల విలువ సుమారు రూ.1.80 లక్షలు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. గతంలోనూ బిక్కేరు వాగు సమీపంలో పలుమార్లు రైతులకు చెందిన మోటార్ల కేబుల్ వైర్లను దుండగులు ఎత్తుకెళ్లారని, ఇప్పుడు ఏకంగా మోటార్లనే అపహరించడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనపై బాధిత రైతులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడంతో పాటు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
