రాజకీయాల్లో దూకుడు మంచిదే..! కానీ..
- ప్రజల కోసం పనిచేయడం శాసన సభ్యుల కర్తవ్యం
- బాధ్యత గల ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలిపై ఆక్షేపణలు
- వ్యవస్థకు తలవంపులు తెచ్చే వ్యాఖ్యలపై ప్రజల్లో వ్యతిరేక భావం
- అధినేతల మెప్పు పొందేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తాపత్రయం
- ఓట్లేసి గెలిసించిన ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా పరిణామాలు
- భావోద్వేగాలను రెచ్చగొడుతూ అధినాయకుల రాజకీయ వ్యూహాలు అమలు
- హోదా, భాద్యత మరిచి చేస్తున్న వ్యాఖ్యలు, ఘటనలపై వ్యతిరేకత
- రాజ్యంఆగ పదవుల్లో ఉన్న వారిపై గల్లిdలో మాట్లాడుతనే మాటలా?
- శాసన సభ్యుల నోటి వెంట బూతు పదాలు, అసభ్యకర వ్యాఖ్యలా..?
- పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై చర్యలకు ఎథిక్స్ కమిటీ చర్యలకు సిఫారసు
- అది తేలక ముందే.. తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం
- రాష్ట్ర రాజకీయాల్లో తాజా పరిణామాలపై రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : బాద్యత గల ప్రజా ప్రతినిధులుగా ఉంటూ ప్రజాస్వామ్య వ్యవస్థకు తలవంపులు తెచ్చే వ్యాఖ్యలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక భావం కనిపిస్తోంది. అసెంబ్లి ప్రాంగణంలో తాజాగా చోటుచేసుకున్న ఘర్షణ వాతావరణం, తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో దూకుడు మంచిదేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష పార్టీ సభ్యులు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేయాల్సి అధికార పార్టీ సభ్యులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, పార్టీల ఉనికిని చాటుకునేందుకు తాపత్రయపడుతుండడం పట్ల సమాజంలో భిన్నాభిప్రాయాలు వినవస్తున్నాయి.
నమ్మకంతో ఓట్లేసి గెలిసించిన ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా నాయకుల వ్యవహార శైలిపై తీవ్రమైన ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణానికి సభ్యుల దుందుడుకు మాటలే అసలు సమస్యగా మారుతోంది. ఈ పరిణామాలను నిలువరించాల్సిన బాద్యత గల అధినాయకులు ఉద్వేగాలను రెచ్చగొట్టడం, ప్రేరేపిత చర్యలకు పాల్పడడం, రాజకీయంగా పైచేయి సాధించేందుకు చేస్తున్న వ్యూహాలను ప్రోత్సహించడం లాంటివి సమస్యలను మరింత జఠిలం చేస్తుండడాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.
ప్రజాస్వామ్యయుతంగా చట్ట సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు వారి బాధ్యతలు, కర్తవ్యాలను మరిచి వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు సహజమే అయిననప్పటికీ, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభ, శాసన మండలి సభ్యులకు ఉండే భాద్యత మరువొద్దన్న అభిప్రాయం సమాజంలో బలపడుతోంది. ప్రజల కోసం దూకుడుగా పని చేయడం మంచిదే కానీ.., రాజకీయ ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న కార్యాచరణతో నష్టం తప్పదని విశ్లేషకులు హెచ్చరికలు చేస్తున్నారు.
కానీ దుందుడుకు మాటలే, అసలు సమస్యగా మారుతున్నాయి. అవి క్రమంగా ముదిరి రాజకీయ విభేదాలకు, శత్రుత్వానికి దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధినేత దృష్టిలో పడేందుకు, నానా హంగామా సృష్టించినట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది. హోదా, భాద్యత మరిచి ఇష్టారాజ్యంగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు సమాజంలో అలజడిని సృష్టిస్తున్నాయి. అందుకు తాజాగా అసెంబ్లి ప్రాంగణంలో చోటుచేస్తున్న ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. గల్లీలో మాట్లాడుకునే మాటలను, బూతు పదాలను, అసభ్యకర వ్యాఖ్యలను శాసన సభ్యులు రాజ్యంగ పదవుల్లో ఉన్న వారిపై వాడటం జుగుప్సాకరంగా మారుతోంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలన్న వాస్తవాన్ని మరిచి, రాజ్యాంగం పరిధులు దాటి ఎవరు ప్రవర్తించినా.. అది నేరమేనన్న అభిప్రాయం మేధావి వర్గాలు, సామాజిక నిపుణులు, విశ్లేషకుల నుంచి బలంగా వ్యక్తమవుతోంది. గతంలో జరిగిన పరిణామాలను గుర్తు తెచ్చకుంటే.. ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల దుమారం, ప్రజల్లో ఉనికిని చాటుకునేందుకు దూకుడు స్వభావం హద్దు మీరుతుందనే అభిప్రాయం, అభ్యంతరాలు కనిపించాయి.
ఆయన ప్రవర్తన తీరుపై, శాసన సభ నియమావళి ఉల్లంఘనపై ఎథిక్స్ కమిటీ తీవ్రమైన అబ్యంతరాలు వ్యక్తం చేస్తూ, తాజాగా చర్యలకు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం ఇరు పార్టీల మధ్య ఘర్ణణను, రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచుతోంది. ఆ వ్యవహారం తేలక ముందే తాజాగా ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఇది పూర్తిగా పార్టీ గౌరవం దెబ్బతినేలా ఉందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ఏ చిన్న పరిణాయం చోటు చేసుకున్నా.. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేయి కళ్లతో చూస్తున్న నేపథ్యంలో, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 14 ఏళ్ల తన ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎక్కడా హింస ప్రేరేపించని కేసీఆర్.. కొందరు, పదే పదే దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న కారణంగా నిందలు భరించాల్సి వస్తున్న వైనంపై అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. సభ్యుల దూకుడుతో రాజకీయంగా ఘర్షణ సరే.. సమాజం అసహ్యం వ్యక్తం చేస్తున్న విషయం బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మరువొద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది ముమ్మాటికీ దూకుడు కాదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
