ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి
- రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
- గోనె సంచులు, రవాణా వాహనాలు సిద్ధం చేయాలి
- జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ
భీమవరం, ఆంధ్రప్రభ: 2026–27 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతి రైతు సేవా కేంద్రంలో అవసరమైన గోనె సంచులను ముందుగానే సిద్ధంగా ఉంచాలని, ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన సంచుల్లో కనీసం 50 శాతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కల్పశ్రీ ఆదేశించారు. ధాన్యం రవాణాకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. తూకంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా తూకపు యంత్రాలను తనిఖీ చేయాలని, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించి ముద్రలు వేయాలని లీగల్ మెట్రాలజీ అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి నిబంధనల ప్రకారం రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని స్పష్టం చేశారు. రైతులకు ధాన్యం కొనుగోలు విధానం, నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతం, ధాన్యం విక్రయానికి అవసరమైన రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని మండల వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతుల వివరాల నమోదు, ధాన్యం నాణ్యత పరిశీలన, కొనుగోలు అనంతర ప్రక్రియలపై శిక్షణా తరగతులు నిర్వహించాలని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌కు తెలిపారు.
ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 2026–27 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లన్నింటినీ సకాలంలో పూర్తి చేసి, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రైతులకు సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ ఎం.డి. ఇబ్రహీం, డీఎస్‌వో ఎం. సరోజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి. సునీత, జిల్లా సహకార శాఖ అధికారి కె. మురళీకృష్ణ, మార్కెటింగ్ శాఖ ఏడీ సునీల్, లీగల్ మెట్రాలజీ అధికారి శివబాలాజీ, ఏఎస్వో ఎం. రవిశంకర్, ఏడీ శ్రీనివాస్, ఎంవీఐ ఎం.డి. జమీర్ తదితరులు పాల్గొన్నారు.
