ఆదోనిలో స్వల్ప భూప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

ఐదు నిమిషాల పాటు కంపించిన భూమి
భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానికులు

ఆదోని, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణం, పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రాత్రి 7.45 గంటల నుంచి 7.50 గంటల మధ్య ఆకస్మికంగా ప్రకంపనలు సంభవించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోని భవనాలు, వస్తువులు స్వల్పంగా కదలడంతో భయాందోళనకు గురైన పలువురు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. పట్టణంలోని మూడు రోడ్ల కూడలి (మూడు చెట్లు) ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. కొద్దిసేపు భవనాలు కంపించడం, ఇంట్లోని వస్తువులు కదలడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

ప్రకంపనల కారణంగా కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి చేరడంతో పట్టణంలో కొద్దిసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూప్రకంపన తీవ్రత, కేంద్ర బిందువు, లోతు తదితర వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. అధికార యంత్రాంగం నుంచి స్పష్టమైన సమాచారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. గతంలోనూ రాయలసీమలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు నమోదైన నేపథ్యంలో తాజా ఘటనపై స్థానికుల్లో చర్చ మొదలైంది. అధికారిక సంస్థలు ప్రకంపనల వివరాలను వెల్లడిస్తేనే ఘటన తీవ్రతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.