మతసామరస్యానికి ప్రతీకగా ఆదిమూర్తి నగర్‌ వినాయకుడు

గత ఏడాది రూ.31 వేలకు గణేష్‌ లడ్డూ దక్కించుకున్న ముస్లిం మహిళ..
ఈసారి కూడా వేలంలో పాల్గొనేందుకు సిద్ధం

అనంతపురం ప్రతినిధి, ఆంధ్రప్రభ : అనంతపురం నగరంలోని ఆదిమూర్తి నగర్‌, గుల్జార్‌పేట్‌ ప్రాంతాలకు చెందిన హిందూ, ముస్లిం యువకులు మతాలకు అతీతంగా ఏటా కళింగ షాపింగ్‌ మాల్‌ రోడ్డులో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చందాల ద్వారా వచ్చిన మొత్తాన్ని విగ్రహ ప్రతిష్ఠకు వినియోగించగా మిగిలిన ఖర్చును యువకులే భరిస్తూ వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే యువకుల్లో ఎక్కువ మంది సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యావంతులే కావడం విశేషం.

ప్రతి ఏడాది వినాయక విగ్రహం ఎదుట లడ్డూ వేలం నిర్వహిస్తారు. ముస్లిం యువత కూడా వినాయకుడిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. నిమజ్జనం రోజున పెద్దలు లడ్డూ వేలంలో పాల్గొంటారు. గత ఏడాది ఖాసింబీ (61) అనే ముస్లిం మహిళ రూ.31 వేలకు వినాయక ఉత్సవ లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. అనంతరం లడ్డూను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు.

ఈ ఏడాది కూడా లడ్డూ వేలంలో పాల్గొంటానని ఖాసింబీ తెలిపారు. అనంతపురంలో కుల, మతాలకు అతీతంగా మతసామరస్యంతో జీవిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. తాను ప్రతిరోజూ ఐదుసార్లు నమాజ్‌ చేస్తానని, అదే సమయంలో కుటుంబ సభ్యులతో సమానంగా హిందువులతో ఆప్యాయత, అనురాగాలు ఉన్నాయని చెప్పారు. గణేష్‌ ఉత్సవ లడ్డూను తాము ఎంతో పవిత్రంగా భావిస్తామని ఆమె తెలిపారు. ఆదిమూర్తి నగర్‌ వినాయక ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.