Adilabad | తేమ నిబంధనలు సడలించాలి ..!

Adilabad | తేమ నిబంధనలు సడలించాలి ..!
మంత్రి తుమ్మలను కలిసిన ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పాటిల్ ..!
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : పత్తి, సోయా, మొక్కజొన్న పంట విక్రయాల్లో తేమ నిబంధనలు సడలించి మద్దతు ధరతో కొనుగోళ్లు చేపట్టాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar), ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ (Rama Rao Patel) కోరారు. బుధవారం ఈ మేరకు సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల పత్తి పంటతో పాటు సోయాబీన్ పంట నాణ్యత కొద్దిగా దెబ్బ తినడం వల్ల కొనుగోలు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పంటను విక్రయించేందుకు రైతే రావాలని నిబంధనలు ఉండడంతో వృద్ధులు కొంతమంది మహిళలు రాలేని పరిస్థితి ఉందని అలాంటి సమయంలో వారి కుటుంబీకు లకు అవకాశం కల్పించాలనీ కోరారు. పత్తి పంటలో 12 క్వింటాళ్ల వరకు విక్రయించేందుకు అవకాశం ఉండగా దాన్ని 7 క్వింటాళ్లకు కుదించడం వల్ల రైతుల నష్టపోతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
కేంద్ర ప్రభుత్వం (Central Government) 12 క్వింటాళ్ల పరిమితితో పత్తి కొనేందుకు సన్నద్ధతో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి పరిస్థితులు వివరిస్తూ లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది పేద రైతులు పరంబోకు భూముల్లో పంటలు సాగు చేశారని, కొందరు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశారని వారి పేర్లు వ్యవసాయ శాఖ సర్వేలో లేకపోవడం వల్ల పంటలను విక్రయించుకోలేకపోతున్నారనీ మంత్రికి వివరించారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యేలు తెలిపారు.
