ఆదివాసీ సంప్రదాయ వేషధారణలో కలెక్టర్, ఎస్పీ సందడి
రిమ్మ గ్రామంలో దండారీ ఉత్సవాల్లో పాల్గొని గిరిజనులతో కలిసి నృత్యాలు
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారీ ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. పల్లెల్లో ఎక్కడ చూసినా గుస్సాడీ బృందాల నృత్యాలు, మహిళల కోలాటాలు, ఆటపాటలు అలరిస్తున్నాయి. దీపావళి వేళ గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది.

ఆదివాసీ వేషధారణలో అలరించిన ఉన్నతాధికారులు
రిమ్మ గిరిజన గ్రామంలో ఆదివాసుల ఆహ్వానం మేరకు గురువారం జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఐటీడీఏ పీఓ మంద మకరంద (ఐఏఎస్), ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ కొట్టే సాయి (ఐపీఎస్) దండారీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆదివాసీ సంప్రదాయ దుస్తులైన ధోవతి, పంచె, తలపాగా, రుమాలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గిరిజనులతో కలిసి అడుగులో అడుగు వేస్తూ దండారీ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. అధికారుల నృత్యాలు, ఆటపాటలు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. అనాదిగా వస్తున్న ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. భావితరాలకు ఈ సంస్కృతిని అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
