గంజాయి కేసు విచారణకు వెళితే పోలీసులపై దాడి!

కర్రలు, రాళ్లతో దాడి.. ఐదుగురు పోలీసులకు గాయాలు

20 మంది నిందితుల అరెస్ట్‌.. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్‌ : సిరికొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వాయిపేటలో గంజాయి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై దాడి చేసి గాయపరిచిన ఘటనలో మొత్తం 20 మందిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. మూడు రోజుల క్రితం విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో సీఐ సహా ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయని, పోలీసు వాహనం ధ్వంసమైందని వెల్లడించారు.

సోమవారం ఏడుగురు నిందితులను, మంగళవారం మరో 13 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసు ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఘటన వివరాలను వెల్లడించారు.

సిరికొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బంగారుపేట గ్రామంలో అక్టోబర్‌ 10న ఉదయం గంజాయి కేసు దర్యాప్తులో భాగంగా వెళ్లిన పోలీసు సిబ్బందిపై గిరిజనులు దాడి చేసినట్లు తెలిపారు. గంజాయి కేసు దర్యాప్తు నిమిత్తం ఇచోడా సీఐ సీహెచ్‌. రమేష్‌, కానిస్టేబుల్‌ బత్తుల శివప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు పోలీసు సిబ్బంది ప్రభుత్వ పోలీసు వాహనంలో ఆ గ్రామానికి వెళ్లినట్లు పేర్కొన్నారు.

గంజాయి కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన నేపథ్యంలో కొందరు వ్యక్తులు గుంపుగా ఏర్పడి పోలీసులపై దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసు వాహనంపై రాళ్లు రువ్వడంతో పాటు, పోలీసు సిబ్బందిపై కర్రలతో దాడి చేసి గాయపరిచారని, వారిని బలవంతంగా సర్పంచ్‌ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు ఎస్పీ తెలిపారు.

అంతేకాకుండా పోలీసులను చంపుతామని బెదిరించడం, ప్రభుత్వ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఫోన్‌ను పగులగొట్టడంతో పాటు మరో సెల్‌ఫోన్‌ను లాక్కోవడం, సీడీ ఫైల్‌ను అపహరించడం వంటి ఘటనలు జరిగినట్లు వెల్లడించారు.

ఐదుగురు పోలీసులకు గాయాలు

ఈ ఘటనలో కానిస్టేబుల్‌ బత్తుల శివప్రసాద్‌ ఎడమ చేతి ఎముక విరిగింది. ఇచోడా సీఐ సీహెచ్‌. రమేష్‌ భుజం, వీపు భాగాల్లో గాయాలయ్యాయి. ఏఎస్ఐ రాథోడ్‌ బలిరామ్‌ ఎడమ చేయి, తొడ, భుజానికి గాయాలయ్యాయి. ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ భీంరావుకు కుడి చేయి, నడుము భాగాల్లో గాయాలు కాగా, ఏఆర్‌ కానిస్టేబుల్‌ గంగారాంకు తలపై రక్తస్రావ గాయమైంది.

ఈ ఘటనపై కానిస్టేబుల్‌ బత్తుల శివప్రసాద్‌ ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీస్‌ స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తును ఇచోడా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించి, దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు.

బాయ్‌పేట సర్పంచ్‌ చిక్రం రాముతో పాటు గ్రామ పటేల్‌ పెందూర్‌ బాదు, పెందూరు మారుతి, చాకటి ఇంద్రకాంత్‌, సేద్మాకి భీమ్రావు, మారుతి, పెందూరి అరుణ్‌, పెందూరి శ్రీరామ్‌, పెందుర్‌ జ్యోతిరామ్‌, కనక భీమ్రావు, పెందురు మహేశ్వర్‌, పెందూరి మనోహర్‌, ఆత్రం జలపతిరావు, సిదం నరేష్‌, గడ్డం విజయ్‌కుమార్‌ సహా మొత్తం 20 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. విధి నిర్వహణకు ఆటంకం కలిగించి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.