(వైశాఖ శుక్ల పంచమి శంకర భగవత్పాదుల జయంతి)
వేదాలలో ఉపనిషత్తులలో, భగవద్గీతలో ఉన్నదే అయినప్పటికీ, ప్రజలు మరిచిపోయిన అంశాలను తిరిగి ఉటంకిస్తూ, బౌద్ధ మతంలోని మంచి సిద్ధాంతాలను చేర్చి, అద్వైత మత స్థాపన ఆచార్యుడైనాడు ఆదిశంకరుడు. తూర్పున పూరీ జగన్నాథంలో గోవర్ధన మఠం, పశ్చిమాన ద్వారకలో కాళికా (శారదా)మఠం, ఉత్తరాన బదిరీ కేదారంలో జ్యోతిర్మఠం, దక్షిణ దిశలో శృంగేరి యందు శృంగగిరి శారదా మఠం స్థాపించి, మత కార్యనిర్వాహణ కోసం, దేశం నలు చెరుగులా సంచరించి, అద్వైత తత్వాన్ని వివరించి, దిగ్విజయ యాత్ర కొనసాగించారాయన. హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతా చార్యులలో ప్రథములు ఆది శంకరులు. క్రీస్తు శకం 788-820 మధ్య శంకరులు జీవించి ఉంటారని ఒక భావన.
త్రిచూర్‌లోని వృషాచల పర్వతం పైగల శివున్ని ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందిన, కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన, నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యాంబ, శివగురువులకు, కేరళలోని పూర్ణ నది తీరాన గల కాలడిలో, ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుక్ల పంచమి నాడు, శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో, సూర్యుడు శని, గురుడు, కుజుడు ఉచ్చ స్థితిలో ఉండగా శంకరులు జన్మించారు. మూడవ యేటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు ఐదవ యేట ఉపనయన సంస్కారము జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని యింటి యిల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదట. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్య్రాన్ని పోగొట్టిందట. సన్యాసం తీసుకోవడానికి తల్లిని అనుమతి కోరగా, ఆమె నిరాకరించగా ఒక నాడు, పూర్ణా నదిలో స్నానమాచరించే సమయాన, మొసలి పట్టుకోగా, మరణించే లోగా నైనా సన్యాసిగా ఉంటానని, తల్లిని కోరగా, ఆమె అంగీకారంతో సన్యాసిగా మారే మంత్రం పఠిస్తూ ఉండగా, మొసలి శంకరులను వదిలేసింది. వ్యాస కుమారుడైన, శుకుని శిష్యులైన, గౌడపాదుల శిష్యుడైన, గోవింద భగవత్పాదుల నర్మదా తీర గుహ దర్శనం లభించింది. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారత దేశ యాత్ర మొదలు పెట్టారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నదిని తన కమండలములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు.
గోవింద పాదులు జ్ఞాన సమాధి నుండి చూసి, సాక్షాత్తూ భువికి దిగివచ్చిన పరమ శివుడే శంకరుడు అని అన్నారు. శంకరులు మొదటి సారిగా, గోవింద భగవత్పాదులకు పాదపూజ చేయగా, నేటికీ ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. గురుసేవ తోనే జ్ఞానార్జన సాధ్యమని, ప్రపంచానికి ఆయన చాటారు. వారణాసిలో సదానందుడు శంకరుని మొదటి శిష్యులయ్యారు. గంగానది వైపు వెళుతున్న సమయంలో, నాలుగు శునకాలతో, చండాలుడు అడ్డు రాగా, చండాలుని మాటలు విన్న శంకరుడు… పరమశివుడే చతుర్ వేదాలతో వచ్చాడని గ్ర#హంచి, మనీషా పంచక స్తోత్రం చేసి, బ్రహ్మ సూత్రాలకు బాష్య సూత్రాలు రాసి, సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశవ్యాప్తంగా శిష్యులను పంపాలని, శివుని ఆదేశం పొంది, కర్తవ్య ముఖులైనారు శంకరులు. ఎనిమిది రోజుల చర్చ అనంతరం, వ్యాస భగవానుని సంతృప్తిపరచి, ఆయుర్థాధిక వరం పొందారు. శంకరులు సన్యాసం తీసుకున్నాక, కొత్త పేరును సూచించే యోగ పట్టం… తీర్థ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనే పది పేర్లను, శంకరుడు మఠం నిర్వాహకులకు నిర్ణయించారు. సాంఖ్య, బౌద్ధ, జైన, వైశేషిక వాదాలను, వేదాంత విరుద్ధ హిందూ భావజాలాన్ని ఖండించి, ఉపనిషత్తుల ఆధారంగా, అద్వైత మతాన్ని నిరూపణ చేసేందుకు స్వానుభవాన్ని జోడించి, తర్కానికి ప్రముఖ స్థానం కల్పించి, భాష్యాలు, ప్రకరణ గ్రంధాలు, స్తోత్రాలు రచించారు. ఆత్మ, బ్రహ్మం (పరమాత్మ) ఒకటే అనేది అద్వైత మూలసూత్రం. ఇందుకు మౌలిక సూత్రాలను, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు, ప్రస్థాన త్రయం నుండి ఆయన గ్రహించారు. క్షీణ దశలో ఉన్న హిందూ మతాన్ని పునరుద్ధరించి, వివిధ శాఖల పండితులను ఓడించి, తన సిద్ధాంతాన్ని ఒప్పించి, భగవంతుని నమ్మే వారందరినీ ఏకీకృతుల చేసి వేదాలలో విశ్వాసాన్ని, హిందువులలో ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. బ్ర#హ్మచర్యాశ్రమం నుండే సన్యాసం స్వీకరించారు. సన్యాసి అయి ఉండి, తల్లికి అంత్యక్రియలు నిర్వహించి, డెబ్బై రెండు మతాల వారిని జయించి, సూత్ర భాష్య శతాధిక ఉద్గ్రంతాలు రచించి, బ్రహ్మసూత్రాల భాష్య కారుడై, కైలాస నాధుని అనుగ్రహం వల్ల జన్మించి, ”సుఖం కలిగించు వాడు” అనే అర్థముతో ”శంకర” నామాంకితులై, 32 ఏళ్ళకే, కైలాస గమనం చేసిన శంకరునికి ప్రత్యేకతలున్నాయి. నువ్వు వేరు… నేను వేరు’ అనే సంకుచిత మార్గం నుండి ‘అందరమూ ఒకటే’ అన్న విశాల మార్గంలోకి రప్పించిన వేదాంతి. ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజ గోవిందము, గోవిందాష్టకము, పాండు రంగాష్టకము, శివ సువర్ణ మాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీ నవరత్న మాలికా, విశ్వనాథా ష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము, సౌందర్య లహరి, శివానంద లహరి, వివేక చూడామణి మొదలైనవి.
- రామకిష్టయ్య సంగనభట్ల