ఏపీ ఎయిమ్స్ యాప్‌తో పారదర్శక సేవలు
జిల్లా వ్యాప్తంగా తగినంత ఎరువుల నిల్వలు..
ఎరువుల సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ
మైలవరం, ఆంధ్రప్రభ: రైతులకు ఎరువుల సరఫరాలో పారదర్శకత, సమర్థత పెంపొందించేందుకు ఏపీ ఎయిమ్స్ యాప్ దోహదం చేస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లాలో రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన మేరకు నిల్వలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం మైలవరం మండలం మొరుసుమిల్లిలోని పీఏసీఎస్ ఎరువుల సరఫరా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎరువుల కేంద్రంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన సరఫరాకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఏపీ ఎయిమ్స్ యాప్‌పై రైతుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా పీఏసీఎస్‌ల వద్ద 2,532 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు ఎరువుల విక్రేతల వద్ద 4,148 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు తెలిపారు. డీఏపీ నిల్వలను పరిశీలిస్తే పీఏసీఎస్‌ల వద్ద 591 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు ఎరువుల విక్రేతల వద్ద 586 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు వెల్లడించారు. ఎరువుల విక్రయాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు లేదా సమస్యలు ఉంటే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 9154970454ను సంప్రదించాలని సూచించారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎరువుల సరఫరా వ్యవస్థను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వ్యవసాయ సీజన్ పూర్తయ్యే వరకు ఎరువుల నిల్వలు, సరఫరా, పంపిణీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
