• 200 సిమ్‌లు, పరికరాల స్వాధీనం

మంచిర్యాల జిల్లాలో రామగుండం పోలీసులు సైబర్ ఫైనాన్షియల్ మోసాల ముఠాను చేధించి, అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడుతున్న నలుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై వివరాలు వెల్లడించిన డీసీపీ ఎగ్గిడి భాస్కర్ మాట్లాడుతూ — టెలికమ్యూనికేషన్ విభాగం సహకారంతో జన్నారం మండలంలో సుస్థిరమైన సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు.

వోడాఫోన్ టవర్ పరిసరాల్లో అనుమానాస్పద సిమ్ కార్డుల వాడకాన్ని గుర్తించి విచారణ చేపట్టిన పోలీసులు, మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన యాండ్రాపు కామేష్, జగిత్యాల జిల్లాకు చెందిన బాపయ్య యాదవ్, మధుకర్ యాదవ్, మంచిర్యాల జిల్లాకు చెందిన గోట్ల రాజేష్ యాదవ్‌లను అరెస్ట్ చేశారు.

ఈ నిందితులు గతంలో కాంబోడియాలో పనిచేసి, అక్కడి నుంచి భారతదేశంలోకి సైబర్ మోసాలకు అవసరమైన పరికరాలు, ఫేక్ సిమ్‌లు, ల్యాప్‌టాప్‌లు తదితరాలను దిగుమతి చేసుకుని, ప్రత్యేకంగా అద్దె ఇంట్లో ఫ్రాడ్ సెటప్ ఏర్పాటుచేశారు. మొత్తం 262 ఆధారాలు లేని సిమ్ కార్డులతో పాటు 72 జియో, 79 ఎయిర్‌టెల్, 111 వోడాఫోన్ సిమ్‌లు, ఫైబర్ నెట్, డీలింక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్‌ను మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, రామగుండం సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ రెడ్డి, లక్షేటిపేట సీఐ రమణమూర్తి, ఇన్స్పెక్టర్లు కృష్ణమూర్తి, శ్రీనివాస్, జన్నారం ఎస్సై అనూష, లక్షేటిపేట ఎస్సై సురేష్, దండేపల్లి ఎస్సై తహసోద్దీన్ తదితరులు సమర్థవంతంగా నిర్వహించారు. డీసీపీ భాస్కర్ వీరందరినీ ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply