ADB | భూ వివాదంలో వేధింపులు.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం !

జన్నారం, (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో భూవివాదం నేపథ్యంలో ఒక మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికంగా నివసిస్తున్న ఎం.డి. సీమ అనే రైతు, తన సొంత బావ అయిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం.డి. ముజుబోద్దీన్.. ఆమేను భూవివాదంలో వేధించడంతో నిరాశకు లోనై శుక్రవారం సాయంత్రం పొలం గట్టు వద్ద క్రిమిసంహారక మందు తాగినట్లు తెలిసింది.

సీమ వివరాల ప్రకారం, గతంలో తన మామ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడంతో తన భర్త మానసిక వికలాంగుడైనందున బావ ముజుబోద్దీన్‌కు ఉద్యోగం లభించిందని చెప్పారు. వారసత్వంగా అత్తమామల భూమిని ఇవ్వకుండా తన భర్తను కొట్టిన ఘటన కూడా ఉన్నట్టు సీమ వాపోయారు.

ఈ సంవత్సరం అదే భూమిలో నారుమడి వేసుకుంటే, బావ గడ్డి మందు చల్లడంతో నారు ఎండిపోయిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. నారుమడి ఎండిపోవడం తట్టుకోలేక తనకు చావే మార్గమని భావించి విషపదార్థం సేవించినట్లు చెప్పారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్‌లో సీమను లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ‘‘సీమ ఇంకా ఫిర్యాదు చేయలేదు. డయల్ 100కు ఫోన్ రాగానే మేము చేరుకుని వెంటనే సాయం అందించాం. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం,’’ అని జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు.

అంతేకాకుండా ఈ భూమిపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నందున సీమపైనే బావ ముజుబోద్దీన్ ఫిర్యాదు చేశారని, అయినప్పటికీ ఆమెను పిలిపించలేదని ఎస్సై పేర్కొన్నారు.

మరోవైపు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ముజుబోద్దీన్ మాట్లాడుతూ, ‘‘సీమ నా మరదలు. కావాలనే అడ్డగోలు ఆరోపణలు చేస్తుంది. ఆ భూమి వారసత్వంగా నాకు వస్తుంది. నారుమడిలో గడ్డి మందు చల్లి తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఆమెపై పోలీస్ స్టేషన్‌లో నేను ఫిర్యాదు చేశాను,’’ అని స్పష్టం చేశారు.

Leave a Reply