క్యూలో నిలబడి ఓటు వేసిన మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం.. ప్రతి ఓటు కీలకమే
కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ ఓటు హక్కు సమానమనే సందేశాన్ని చాటుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని తన స్వగ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఆయన సతీమణి కింజరాపు విజయమాధవి, కుమారుడు కింజరాపు కృష్ణమోహన్ నాయుడు, అన్న హరివరప్రసాద్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తన అధికారిక హోదాను పక్కనపెట్టి సామాన్య పౌరుడిలా ఇతర ఓటర్లతో కలిసి క్యూలో నిలబడ్డారు. తన వంతు వచ్చే వరకు వేచి ఉండి ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేననే భావాన్ని చాటిచెప్పారు.
అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది అని, ప్రజల భవిష్యత్తును నిర్ణయించే అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు ఓటు అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రతి ఓటు కీలకమని, ఒక్క ఓటు కూడా సమాజ భవిష్యత్తును మార్చగలదని అన్నారు.
ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదని, సమాజం పట్ల ప్రతి పౌరుడికీ ఉన్న బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ బాధ్యతాయుతమైన పౌర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి ఆకాంక్షించారు.
